చిత్తూరులో 24 చెరువులకు గండ్లు

చిత్తూరు జిల్లాలో 24 చెరువులకు గండ్లు
నిన్న, నేడు విద్యాసంస్థలకు సెలవులు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో సగటున 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా విజయపురం మండలంలో 99.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది పెనుమూరులో 86.6 మిల్లీమీటర్లు, కార్వేటి నగరంలో 80.4 మిల్లీమీటర్లు, నిండ్ర లో 70. 4, వెదురుకుప్పంలో 79.4, పూతలపట్ల 79.2, ఐరాలలో 59.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చెరువులు గండ్లు పడటం, తూములు దెబ్బతినడం, బండలు జారిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని రెండు ప్రధాన జలాశయాలైన కలవకుంట ఎన్టీఆర్ రిజర్వాయర్, కృష్ణాపురం రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తున్నాయి. కలవకుంట రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అదే విధంగా, కృష్ణాపురం రిజర్వాయర్‌లో కూడా బుధవారం సాయంత్రం రెండు గేట్లు ఎత్తి ప్రవాహాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు. భారీ వర్షాల ప్రభావంతో జిల్లాలో 24 చెరువులు దెబ్బతిన్నాయి. వీటిలో పలు చోట్ల రింగ్ బండలు జారిపోవడం, కాల్వలు దెబ్బతినడం, తూముల లీకేజీలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా సోమల, పెద్దపంజాని, పలమనేరు, గంగవరం, పెనుమూరు, వెదురు కుప్పం మండలాల్లో చెరువులకు గణనీయమైన నష్టం జరిగింది. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువులను పరిశీలించి మరమ్మతు పనులకు అంచనా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా బహుదా నది, గార్గేయ నది, నీవా నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీటి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలకు అప్రమత్తం చేయమని అధికారులు సూచించారు. అనేక రహదారులు వాగుల నీటిలో మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు నగరంలోని జనకారపల్లి, టెలిఫోన్ కాలనీ, గాంధీ రోడ్డు, తేనెబండ, వెంగళరావు కాలనీ పరిసర ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి.

డ్రైనేజీ లైన్లు పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్షంగా పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐదు రోజులపాటు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ రోజుకు 24 గంటలు పని చేస్తుందని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా బుధ, గురు వారాలు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అన్ని మండల అధికారులు తమ కార్యాలయాల్లో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాగులు పొంగిపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇరుక్కుపోయారు. గంగాధర్ నెల్లూరు మండలంలో ఒక ఇల్లు దెబ్బతినడంతో బాధితురాలికి స్థానిక ఎమ్మెల్యే రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మరోవైపు, ఐదు రోజుల క్రితం పలమనేరు సమీపంలోని కళ్యాణరేవు జలపాతంలో దూకిన యూనిస్ అనే యువకుడు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రమాదావస్థలలో ఉన్న చెరువులపై 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రజలు వాగులు, వంకలు దాటకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

దెబ్బతిన్న 24 చెరువులు

ఇటీవలి భారీ వర్షాలతో చిత్తూరు జిల్లాలోని అనేక చెరువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలాల వారీగా చెరువుల బండలు జారిపోవడం, పైపింగ్ యాక్షన్ వల్ల బండలు తెగిపోవడం, తుముల లీకేజీలు చోటుచేసుకున్నాయి. ఇరిగేషన్ విభాగం అధికారులు అందించిన వివరాల ప్రకారం, పలు చెరువుల్లో బండలు తెగిపోవడంతో నీరు పొలాలకూ, పల్లెలకూ చేరి రైతులకు నష్టాన్ని కలిగించింది. సోమల మండలంలో పొదలవైకుంటపల్లి గ్రామంలోని దలవైకొత్త చెరువు తెగింది. నంజంపేట గ్రామంలోని చెక్ డ్యాం దెబ్బతింది. పుంగనూరు మండలంలోని ముదిబాపురపల్లి చెరువు, చౌడేపల్లి మండలంలోని బుటకపల్లి చెరువులు పైపింగ్ యాక్షన్ కారణంగా బండలు జారిపోయాయి. పెద్దపంజాని మండలంలోని మరికుంట, వుటకుంట, కోర్నికుంట, సుద్దగుంటపల్లె, రాచపల్లి గ్రామాల చెరువులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాచపల్లి వొద్ద చెరువు బ్రీచ్ కావడంతో నీరు పొంగి పంట పొలాల్లోకి ప్రవేశించింది. పలమనేరు మండలంలోని పెడ్దచెరువు, చెన్నమద్దయ చెరువు, బొన్నిమొద్ది చెరువుల్లో బండ పైపింగ్, సర్ప్లస్ వయర్ నష్టం నమోదైంది. గంగవరం మండలంలోని ఎడురు చెరువు, సింగారాయమి చెరువు, పసుపతినాయకపల్లి చెరువులు స్లూయిస్ లీకేజీ, బండ స్లైడింగ్ వల్ల దెబ్బతిన్నాయి.

బైరెడ్డి పల్లె మండలంలోని వెంకటేశ్వర్ల కుంట, వెదురు కుప్పం మండలంలోని యనమలమండ ట్యాంక్, నాచుకూరు, మంచినెల్లగుంట, పెడ్డినయినీ చెరువు, అమ్మ చెరువుల్లో కూడా గణనీయమైన నష్టం చోటుచేసుకుంది. గుడిపాల మండలంలోని బోజవారిపల్లి చిన్న చెరువు, పెనుమూరు మండలంలోని గంగన్న ట్యాంక్, విజయపురం మండలంలోని పన్నూరు ట్యాంక్లు సర్ప్లస్ కోర్స్, సప్లై చానల్ బ్రీచ్ కావడంతో తీవ్ర నష్టం కలిగింది. ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ చెరువులను పరిశీలించి అంచనా నివేదికలు సిద్ధం చేశారు. మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని సంబంధిత శాఖల అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Leave a Reply