మహిళా సాధికారతతోనే మహాత్మా పూలేకు నిజమైన నివాళి…

మహిళా సాధికారతతోనే మహాత్మా పూలేకు నిజమైన నివాళి…

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : సామాజిక సమానత్వం కోసం పరితపించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు విద్యావంతులు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో బీసీ భవన్ లో నిర్వహించిన పూలే 199 జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. నాడు సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి, ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది దేశంలోనే తొలి బాలికల పాఠశాలను స్థాపించిన ఘనత పూలే దంపతులకే దక్కుతుందని కొనియాడారు.

సభలో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండటం శుభపరిణామమని పేర్కొన్న కలెక్టర్.. స్థానిక భవనానికి15,000 విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్ నిధుల నుంచి తక్షణమే చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఈ భవనాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ,విద్యావంతులైన సమాజమే పూలేకు దక్కే అసలైన గౌరవమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.

బీసీ సబ్‌ప్లాన్‌కు 15,000 కోట్ల రూపాయిలు కేటాయించామని, కూటమి ప్రభుత్వం బీసీల కోసం 1000 కోట్లతో ఆదరణ పథకాన్ని త్వరలో పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. మత్స్యకారుల ప్రయోజనాల దృష్ట్యా వివాదాస్పద జీవో 217ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జ్యోతిబా పూలే పాఠశాలలను 10+2 స్థాయికి పెంచామని, వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.

దీనిలో భాగంగా 17.5 కోట్ల రూపాయిలతో హాస్టళ్లలో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చేపట్టామని తెలిపారు. సమ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్న పూలే సిద్ధాంతానికి అనుగుణంగా ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేస్తోందని తెలిపారు . కార్యక్రమంలో ఎస్ సి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినాయక రెడ్డి, శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు పాల్గొని పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply