నాణ్యతపై రాజీ ప‌డొద్దు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

  • గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు
  • సాస్కి నిధులను సద్వినియోగం చేసుకోండి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాస్కి (Special Assistance to States for Capital Investment) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను సద్వినియోగం చేసి ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించాల్సిందిగా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

సాస్కి నిధులతో నిర్మించే రహదారుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
“నిర్మాణ దశ నుంచి పూర్తయ్యే వరకు క్వాలిటీ చెక్ తప్పనిసరిగా జరగాలి. అధికారులు స్వయంగా తనిఖీలు చేయాలి. ప్రమాణాలు పాటించకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవకతవకలు జరిగితే ఎవరినీ ఉపేక్షించం,” అని ఆయన హెచ్చరించారు.

గ్రామీణ మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యం…

ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా మరో ముందడుగు వేసిందని పవన్ తెలిపారు.

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా రహదారి సదుపాయాల బలోపేతానికి రూ.35 కోట్లు సాస్కి నిధుల నుంచి కేటాయించినట్లు పవన్ వెల్లడించారు. ఇలాంటి ప్రత్యేక ప్రాజెక్టులకు సాస్కి నిధులు ఎంతో తోడ్పడతాయని చెప్పారు.

రోడ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉన్నా, వాటిని వాడుకోలేదని… అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

Leave a Reply