District Collector | రోగులకు నాణ్యమైన వైద్య సేవలు..
- సి.ఎం.సి. వేలూరు, చిత్తూరు క్యాంపస్ మధ్య పీపీపీ విధానంలో అవగాహన ఒప్పందం
District Collector | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సి.ఎం.సి. వేలూరు, చిత్తూరు క్యాంపస్ మధ్య పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అవగాహన ఒప్పందం (ఎంఓఏ) కుదిరింది. ప్రభుత్వ తరఫున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సి.ఎం.సి. తరఫున డైరెక్టర్ డా. విక్రమ్ మ్యాథ్యూస్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం మిట్టూరు వార్డులోని ప్రభుత్వ పాత ప్రసూతి కేంద్రంలో సి.ఎం.సి. చిత్తూరు క్యాంపస్‌కు చెందిన వైద్యులను నియమించి అవుట్‌పేషెంట్ సేవలు, వైద్య సలహాలు, చికిత్స సమన్వయ సేవలను అందించనున్నారు. అలాగే పట్టణ పరిసరాల్లో సేవల లేమితో బాధపడుతున్న స్లమ్ ప్రాంతాలు, చేరుకోవడం కష్టమైన ప్రాంతాలకు మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా వైద్య సేవలను విస్తరించనున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రాథమిక వైద్య సేవల ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా ఇది ఒక నూతన ముందడుగని అన్నారు. ప్రజారోగ్య రంగంలో ఇలాంటి వినూత్న భాగస్వామ్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు కొనసాగిస్తామని తెలిపారు.
అదేవిధంగా సి.ఎం.సి. డైరెక్టర్ డా. విక్రమ్ మ్యాథ్యూస్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే సి.ఎం.సి. ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ లక్ష్య సాధనలో ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం లభించడం ఆనందకరమని చెప్పారు.

పట్టణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సంక్రమణ కాని వ్యాధులు (ఎన్‌సీడీలు) ప్రధాన ప్రజారోగ్య సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ఎంతో కీలకమని జిల్లా అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సమయానుకూలంగా, అవసరానుగుణంగా చికిత్స అందడంతో పాటు నిరంతర వైద్య సంరక్షణకు మరింత భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సుధారాణి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. లోకేష్, సి.ఎం.సి. చిత్తూరు క్యాంపస్ అసోసియేట్ డైరెక్టర్ డా. ఉదయ్ జకారియా, మెడికల్ సూపరింటెండెంట్ డా. ఐ. రాజేష్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. డోరోథీ లాల్, ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ డా. లోకేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

