ఉచిత చేప పిల్లల పంపిణీ ఎంతో మేలు
లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ఎంతో మేలు చేస్తుందని, వారి సంక్షేమం కోసమే ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. మండలంలోని గుల్లకోట ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్(Dilip Kumar)తో కలిసి చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాదికి గాను జిల్లాలో 223.93 లక్షల చేప పిల్లలు పెంచేందుకు ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 380 చెరువులు/రిజర్వాయర్లు ఉన్నాయని, వీటిలో 369 సీజనల్(369 Seasonal) చెరువులలో 115.65 లక్షల 35- 40 మిల్లీమీటర్ల సైజు గల చేప పిల్లలు, 5 పేరినియల్, 6 రిజర్వాయర్లలో 108.28 లక్షల 80- 100 మిల్లీమీటర్ల సైజు గల చేప పిల్లలను వదలాలని నిర్ణయించినట్లు వివరించారు.
మంచిర్యాల నియోజకవర్గంలో 51.58 లక్షల ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని, 15 నుండి 20 రోజులలో కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా రూట్ మ్యాప్ తయారుచేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గుల్లకోట ప్రాంతం(Gullakota area)లో ఈ రోజు 24 లక్షల 42 వేల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు.

చేపలపై ఆధారపడిన మత్స్య సొసైటీలు, మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు మొబైల్ చేపల విక్రయ వాహనాలను నడిపించేందుకు ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్(Vice Chairman Arif), నాయకులు పింగళి రమేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

