మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గవినోళ్ళ రాధాలక్ష్మారెడ్డి

పాఠశాలలకు వంట సామాగ్రి పంపిణీ

మక్తల్ , అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ) : మక్తల్ మండలంలోని వివిధ పాఠశాలలకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గవినోళ్ళ రాధా లక్ష్మారెడ్డి వంట సామగ్రి పంపిణీ చేశారు. బుధవారం స్థానిక ఎంఆర్సీ భవనం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనానికి, వంట సామగ్రిని మండలంలోని 8 ఉన్నత పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత పాఠశాలలు, 29 ప్రాథమిక పాఠశాలలకు గాను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సంబంధించి ప్రతి పాఠశాలకు వంట సామగ్రిని అందజేయడం జరిగిందన్నారు . మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇటీవ‌ల అక్కడక్కడ మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన సంఘటనలు జ‌రిగాయ‌ని, అవి పునరావృతం కాకుండా చూడాల‌న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, కాపీలు, మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం అందిస్తుంద‌ని పేర్కొన్నారు.

ప్రతీ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వారికి శ్రీహరి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా చూడడమే తమ లక్ష్యమన్నారు. ఇటీవలే మక్తల్ పట్టణంలో నూతనంగా రెండు పాఠశాలలను ప్రారంభించిన‌ట్లు మార్కెట్ చైర్పర్సన్ రాధా లక్ష్మారెడ్డి అన్నారు.

కార్యక్రమంలో ఎంఈఓ అనిల్ గౌడ్, బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం నాగేశ్వరయ్య, బాలుర ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ నాగార్జున్, మాజీ జెడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా,రాములు, చెన్నయ్య గౌడ్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply