Indrakeeladri | దర్శన దందాపై కొరడా…
- దళారులతో కుమ్మక్కైన వారిపై వేటు
- ఇద్దరు పెర్మనెంట్ ఎంప్లాయిస్ సస్పెండ్
- నలుగురు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
- త్వరలో మరికొందరిపై చర్యలు
( విజయవాడ ఆంధ్రప్రభ ) : పరమభక్తితో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు శీఘ్రదర్శనం పేరుతో దందాలు నిర్వహించే వారికి సహాయపడుతున్న ఉద్యోగులపై ఈవో రామచంద్ర మోహన్ కొరడా జలుపించారు. దళారులతో కుమ్మక్కై అడ్డదారుల్లో దర్శనాలు చేయిస్తున్న ఇద్దరు పెర్మనెంట్ ఎంప్లాయిస్ ను సస్పెండ్ చేసిన ఈవో, మరో నలుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుండి తప్పించారు.
గత నెల 29వ తేదీన అనధికారిక దర్శనాలు చేయిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని ఆలయ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరితో కుమ్మక్కైన భక్తులకు నుండి వేల రూపాయలను తీసుకుని.. దొంగ దారిలో అమ్మవారి దర్శనాలను చేయిస్తున్న విషయం బయటపడింది.
ఆలయ అధికారులు సిబ్బంది సహకారంతోనే ఈ దందా కొనసాగుతుందని విచారణలో వెల్లడయ్యింది. ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణాల్లోకి తీసుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, కనకదుర్గమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ పూర్తిస్థాయిలో విచారణ చేశారు. వీటికి కారకులైన వారిపై కొరడా జూలిపించారు.
ఆలయంలో పర్మినెంట్ ఉద్యోగులుగా ఉన్న పుల్లారావు, మైక్ ఆపరేటర్ నాగేశ్వరావు లను సస్పెండ్ చేశారు. వీరితో పాటు ఆలయంలో తాత్కాలిక ఉద్యోగులైన సెక్యూరిటీ గార్డ్ కోటేశ్వరరావు, డ్రైవర్ నాగరాజు, హోంగార్డు భాస్కరరావు, పల్లకీ బోయీ చిన్న జమలయ్యలను విధుల నుంచి పూర్తిగా తప్పించారు. ఈ దందాకు సంబంధించి లోతుగా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజులలో మరికొందరిపై వేటు పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.