Devotional మరికొద్దిసేపట్లో ఒంటిమిట్టలో సీతారామం – పండు వెన్నెల్లో పరిణయోత్సవం!

అంగరంగ వైభవంగా నేడే సీతారాముల కళ్యాణం
పట్టువస్త్రాల సమర్పించనున్న సీఎం చంద్ర‌బాబు
పూల అలంకరణ.. సుందరంగా కోదండరామాలయం
టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం
కనులారా చూసేందుకు తరలివస్తున్న భక్త జనం
హనుమయ్య లేని వేడుక.. ఇక్కడంతా విభిన్నమే

ఒంటిమిట్ట, ఆంధ్రప్రభ : దేశంలోనే విభిన్న రీతిలో ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం జరుగుతోంది. శుక్రవారం రాత్రి పండు వెన్నెల్లో చంద్రుడు వీక్షిస్తుంటే .. సీతారామచంద్రుల కళ్యాణం కమనీంగా జరగనుంది. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆయన పరిణయ మహోత్సవాలు యావత్ భారతావనిలోని ఆలయాల్లో చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి మొదలై నవమి రోజున కల్యాణంతో ముగుస్తాయి. దీనికి భిన్నంగా శ్రీరామచంద్రుడు, సీతమ్మను పరిణయమాడే మహత్తర ఉత్సవాన్ని చైత్ర శుద్ధ చతుర్ధశి నాటి రాత్రివేళ పండువెన్నెల్లో నిర్వహించడం ఏకశిలానగరి ఒంటిమిట్ట ప్రత్యేకం.

ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు, త‌లంబ్రాలు

ఒంటిమిట్టకు ఏపీ, తెలంగాణ సహా దక్షిణ భారతం నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా సీతారాముల కల్యాణానికి అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌..

ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల విద్యుద్దీపాలు, దేశ, విదేశాల్లో లభించే అరుదైన పుష్పాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా కల్యాణవేదిక ప్రాంతంలో 23 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ల‌ను ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌, జేఈవో వీరబ్రహ్మం కల్యాణోత్సవ వైభవాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎస్వీబీసీ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు.

చంద్రుడికి శ్రీరాముడి వరం..

శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు హాజరయ్యారట. సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి. కానీ, సూర్యుడు అస్తమించకుండా అక్కడే ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముడిని చూడ్డానికి రాలేకపోయాడు. ఇక చంద్రుడు ముభావంగా ఉండటాన్ని గమనించిన శ్రీరాముడు, నేను రామచంద్రుడు అని నీ పేరే పెట్టుకుంటానని సముదాయించినా చంద్రుడిలో మార్పు రాలేదు. ద్వాపర యుగంలో రాత్రి 12 గంటలకు కృష్ణావతారంలో జన్మిస్తానని చెప్పినా చంద్రుడు మదనపడుతూనే ఉన్నాడు. నీ కోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రి నా కల్యాణం జరిపించుకుంటానని చెప్పిన తర్వాత సంతోషించాడని పురాణగాథ ఉంది.

ప్రాచుర్యంలో మ‌రో క‌థ..

పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు, లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. వీరిద్దరూ కలిసి జన్మించారు కాబట్టే చంద్రుడిని చందమామ అంటాం. మరోవిధంగా చూస్తే రాముడిది సూర్యవంశం, సీతాదేవిది చంద్రవంశం. భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరఫు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి, సీతారామ కల్యాణం కూడా వెన్నెల రాత్రి చేస్తారనేది ప్రాచుర్యంలో ఉంది..

హనుమంతుడు లేని రామాలయం

ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు చెక్కారు. ప్రతి రామాలయంలోనూ సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి స్వరూపం కనిపిస్తుంది. కానీ, ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదు. పూర్వకాలంలో మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ ఎక్కువై రాముడిని ప్రార్థిస్తే, ఆ సమయంలో రాముడు కోదండం, పిడిబాకు పట్టుకొని ఆ యాగాన్ని రక్షించాడని, అదే సమయంలో ఇక్కడ వెలిశారని ఓ కథ ప్రచారంలో ఉంది. అప్పటికి రాములవారికి ఆంజనేయస్వామి పరిచయం కాలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉండదని చెబుతారు. సీతారామ లక్ష్మణుల స్వరూపాలు ఏకశిలలోనే ఉండడంతో ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉంది..

అతిపెద్ద గోపురం ఇక్కడి ప్రత్యేకత

ఒంటిమిట్ట రాజగోపురం నిర్మాణం చోళ శిల్ప శైలిలో ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు దేశంలోని పెద్ద గోపురాలలో ఇది ఒకటని చెప్పారని చరిత్రకారులు చెబుతారు. ఒంటిమిట్ట దేవాలయం ఆర్కిటెక్చర్‌ పరంగానూ చాలా విశిష్టమైన దేవాలయం. చోళులు, విజయనగరం సామ్రాజ్యాధినేతలు నిర్మించారు. చోళులు ప్రారంభించగా విజయనగర సామ్రాజ్యం పూర్తి చేసింది. ఇక్కడి శిల్పాల్లో రెండు శైలులూ కనిపిస్తాయి. రంగ మండపంలో 32 స్తంభాలు ఉంటాయి. మండపం ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా ఉంటుంది.పైన రూఫ్ ఉన్నా గాలి వస్తుంటుంది. ఇక్కడ స్తంభాలు పోలో స్టైల్లో ఉంటాయి. పైన స్ట్రక్చర్ ఉంటుంది, అంటే విగ్రహాలు మలిచి ఉంటాయి. విశాల ఆవరణ ఉండే ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. చోళ, విజయనగర వాస్తుశైలి కనిపించే ఆలయ స్తంభాలపై రామాయణ, భాగవత కథలు కూడా కనిపిస్తాయి. ఆలయానికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం. పక్కనే రథశాల, రథం ఉంటాయి.

నవాబు తవ్వించిన బావి..

ఒంటిమిట్ట శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తులను ఇక్కడి ఇమాంబేగ్ బావి ప్రత్యేక ఆకర్షణ. 1640 లో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా ఇమాంబేగ్‌ను నియమించారు. ఇమాంబేగ్ ఈ ఆలయానికి వచ్చిన సమయంలో, మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని భక్తులను ప్రశ్నించాడని, చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని సమాధానం చెప్పడంతో ఆయన మూడుసార్లు రాముడిని పిలిచారని చెబుతారు. బదులుగా ఆయనకు మూడు సార్లు ఓ అని సమాధానం రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. రాములోరి భక్తుడిగా మారిపోయారు. భక్తుల దాహార్తి తీర్చటానికి ఓ బావిని తవ్వించారు. ఆయనపేరు మీదే ఆ బావిని ఇమాంబేగ్ బావి అని పిలుస్తారు. అందుకే, ఒంటిమిట్ట ఆలయంలో కోదండరాముడిని ముస్లింలు కూడా దర్శించుకుంటారు.

సీతారాములకు కోటి తలంబ్రాలు

సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణ అప్పారావు ఆధ్వర్యంలో 120 కిలోల తలంబ్రాలను టీటీడీ అధికారులు హనుమంతయ్య, శ్రావణకుమార్‌కు అందజేశారు. వీటికోసం మూడు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, తమిళనాడుకు చెందిన భక్తులు ఎంతో భక్తితో 3 నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారని తెలిపారు. ఈ సంఘం ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, మూడేళ్లుగా అయోధ్యకు, ఎనిమిదేళ్లుగా ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం సందర్భంగా కోటి తలంబ్రాలను అందజేస్తున్నట్లు అప్పారావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *