నంద్యాల బ్యూరో, ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పండుగ సందర్భంగా శ్రీశైలంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. షూ లైన్ లో భక్తుల తాకిడి అధికమైంది. బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల సౌకర్యార్ధం విస్తృత ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లకు విశేషపూజలు చేపట్టారు. స్వామి అమ్మవార్ల లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాలయంలో ఓ ప్రణాళికా బద్దంగా క్యూలైన్ల నిర్వహణ ఏర్పాట్లను పూర్తిచేసి భక్తులకు క్యూకాంప్లెక్స్ లో అల్పాహారం, మంచినీరు, బిస్కెట్ల అందజేస్తున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంకాలం సమయంలో ప్రభోత్సవం, నందివాహనసేవ, ఆలయ ఉత్సవం కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పది గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాత్రి పాగాలంకరణతో పాటు శ్రీ స్వామి అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి.ఉత్సవంలో పలు సంప్రదాయ, జానపద, కళారూపాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది.

ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద, గోసంరక్షణశాల దగ్గరలోని యాంఫీథియేటర్ నందు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పాతాళ గంగ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఇద్దరు గల్లంతయినట్టుగా వస్తున్న వార్తలపై పోలీసులు, దేవాదాయ శాఖ వారు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఇన్చార్జి ఎస్పీ విశ్రాంతి పాటిల్ ఆధ్వర్యంలో భక్తులకు పాతాళగంగలో స్నానమాచరించే వారికి భద్రతా చర్యలు చేపట్టారు.