Development |రాయలసీమ అభివృద్ధిపై జగన్ చర్చకు సిద్ధమా?..

Development | రాయలసీమ అభివృద్ధిపై జగన్ చర్చకు సిద్ధమా?..
Development | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : గత ఐదేళ్లు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన జగన్ నేడు దీక్షల పేరుతో డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు మీరు చేసిన అభివృద్ధిపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ లో పెడితే… అందులో కనీసం రూ.2 వేల కోట్లు కూడా రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదు. వర్షాభావం తక్కువగా ఉన్న రాయలసీమలో చంద్రబాబు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు శ్రీకారం చుడితే… రైతులకు ఎంతో ఉపయోగకరమైన డ్రిప్ ఇరిగేషన్ ను జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేశాడు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆగిపోయిందన్నారు. ఇదే విషయాన్ని జగన్ స్నేహితుడు, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా చెప్పారు. బీఆర్ఎస్ కేసులు వేసి రాయలసీమ లిప్ట్ ఆపేశామని… దానిపై జగన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆగిపోయిన రాయలసీమ లిప్ట్ ప్రాజెక్టుకు నాలుగేళ్లు అధికారంలో ఉన్నా జగన్ ఎందుకు పట్టించుకోలేదు. ఎందుకు ఎన్జీటీలో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. అధికారం పోయిన రెండేళ్లకు జగన్ కు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు గుర్తొచ్చింది. ప్రధాని మోదీని అనేక సార్లు కలిసి ఎందుకు రాయలసీమ లిప్ట్ పై మాట్లాడలేదన్నారు.
జగన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాడు కర్నూలులో జగన్ దీక్ష చేశాడు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి కేసీఆర్ ఇంట్లో బిర్యానీలు తిని వచ్చాడు. కేసీఆర్ ను రాయలసీమ లిప్ట్ కు ఎందుకు ఒప్పించలేకపోయావు?. అంటూ నిలదీశారు.
సీఎం చంద్రబాబు సారథ్యంలో 2017 లోనే ముచ్చుమర్రి వద్ద 13 పంపులతో నీటిని తరలించేలా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించారన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా 798 అడుగుల నుంచి నీటిని తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ముచ్చమర్రి ద్వారా కేసీ కెనాల్ కు లింకు చేసి తద్వారా తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్ఎస్బీ, హంద్రీనీవాకు నీటిని తరలించే ఆవకాశం ఉందని వైసిపి నాయకులకు ఈమాత్రం అవగాహన లేదా అంటూ ధ్వజమెత్తారు.
కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతోనే జగన్ రాయలసీమ లిప్ట్ పేరుతో అనుమతులు లేకున్నా, అనుమతులు రావని తెలిసినా పనులు మొదలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ ఫైన్ విధించేలా పనులు చేశారన్నారు. నిజంగా రాయలసీమకు నీరు ఇవ్వాలనే చిత్తశుద్ధి జగన్ కు ఉంటే ఎందుకు హంద్రీనీవా కాలువ విస్తరణ చేయలేదు? అంటూ ప్రశ్నించారు. ఎందుకు అలగనూరు, గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించలేదన్నారు.
కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 60 మంది ప్రాణాలు పోయినా జగన్ పట్టించుకోలేదు. మూడేళ్లు అన్నమయ్య ప్రాజెక్టుకు అతీగతి లేదన్నారు. నంద్యాల జిల్లాలో రైతులకు అవసరమైన గోరుకల్లు, అలగనూరు, శ్రీశైలం ప్రాజెక్టుల మరమ్మతులకు కూడా జగన్ నిధులు ఇవ్వలేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రూ.320 కోట్లు ఈ ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు ఇచ్చిందన్నారు. రాయలసీమపై మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు. రాయలసీమకు ద్రోహం చేశారు కాబట్టే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు.
