మామండూరు అటవీ క్షేత్రంలో డిప్యూటీ సీఎం…

మామండూరు అటవీ క్షేత్రంలో డిప్యూటీ సీఎం…
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : చుట్టూ కొండలు, గల గల పారే వాగులు, పచ్చని ప్రకృతి ఒడిలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సేదతీరారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ శనివారం మామండూరు అటవీ క్షేత్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు డిప్యూటీ సీఎం వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ ప్రాంతంలోని సహజ సౌందర్యాన్ని ఆస్వాదించారు. ఉపముఖ్యమంత్రి అక్కడి వాటర్‌ఫాల్స్‌ను, పచ్చని చెట్లను, అటవీ జీవవైవిధ్యాన్ని పరిశీలించారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన టవర్‌పైకి ఎక్కి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలెక్టర్, ఎస్పీతో కలిసి మొక్కలు నాటారు.
కాలి నడకన వెళ్లిన పవన్
పవన్ కల్యాణ్ అడవిలో నాలుగు కిలోమీటర్లుపైగా ప్రయాణించారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు. దారిలో కనిపించిన ప్రతి చెట్టును ఆసక్తిగా పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు.
వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎర్రచందనం గోడౌన్ తనిఖీ
అనంతరం మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గోడౌన్‌ను శనివారం మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్‌ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ,బీ,సీ నాన్ గ్రేడ్‌ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్‌లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
