Deported | అక్రమవలసదారులు తరలింపులో రూటు మార్చిన ట్రంప్
వాషింగ్టన్, ఆంధ్రప్రభ: అక్రమవలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా రూట్ మార్చారు. ఇప్పటి వరకు యుద్ద విమానాలలో ఆయా దేశాలకు తరలించిన ట్రంప్ ఇప్పడు తన సమీప దేశాలకు ఆ బాధ్యతను అప్పగించేశారు. దేశంలో దొరికినవారికి దొరికినట్లు పక్కదేశాలకు ట్రాన్స్ పోర్ట్ చేయడం ప్రారంభించేశారు..అలాగే ఇటు కోస్టారికాతోనూ, పనామా దేశంతో అమెరికా ఈ వలస రవాణపై ఒప్పందాలు కుదుర్చకున్నాయి. దీనిలో భాగంగా 200 మంది భారత అక్రమ వలసదారులతో కూడిన తొలి విమానం కోస్టారికాకు బుధవారం చేరింది.
వలసదారుల తొలి విమానం నేడు తమ దేశానికి వచ్చిందని కోస్టారికా అధ్యక్షుడు రొడిగ్రో చావెస్ రోబెల్ కార్యాలయం ప్రకటించింది. సందర్బంగా రొడిగ్రో మాట్లాడుతూ భారత్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు చెందిన 200 మంది ఆ విమానంలో వచ్చారన్నారు. అనంతరం వారిని మాతృదేశాలకు పంపేస్తాం. ఈ విషయంలో అమెరికాతో సమన్వయం చేసుకుని పని చేస్తాం. ఇరు దేశాల మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తాం అని తెలిపారు. అయితే.. 200 మందిలో భారతీయులు ఎందరన్నది మాత్రం వెల్లడించలేదు. అమెరికా తన సొంత నిధులతో చేపడుతున్న వలసదారుల తరలింపు ప్రక్రియను అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) పర్యవేక్షిస్తోంది. కోస్టారికాలో ఉన్నంతకాలం వలసదారుల సంరక్షణ తదితర బాధ్యతలను ఆ సంస్థే చూసుకోనుంది.
పట్టుబడిన వారిలో ఇండియా, నేపాల్, శ్రీలంక వాసులు
ఇదిలా ఉండగా.. ఇప్పటికే అక్రమవలసదారులను అమెరికా పనామా దేశానికి తరలించింది. భారతీయులతో సహా పలు దేశాల అక్రమ వలసదారులను పనామా ఒక హోటల్ లో ఉంచింది. యూఎస్ ఆదేశాల మేరకు పనామా ప్రభుత్వం వారికి అక్కడ బస ఏర్పాటు చేసింది. వలసదారుల్లో ఇరాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గాన్, చైనా ఇతర దేశాల వలసదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా దేశాల అధికారులు వారిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేసే వరకు హోటల్‌లోనే ఉంటారని ఈ మేరకు పనామా వెల్లడించింది. పట్టుబడిన వారిలో 40 శాతం మంది సొంతంగా తమ దేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా లేరని పనామా అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ వారిని వారి వారి దేశాలకు పంపిస్తామని అధికారలు వెల్లడించారు.