Demand | ఎక్స్ ప్రెస్ హైవేపై పోత‌న‌ప‌ల్లె గ్రామ‌స్తుల ధ‌ర్నా

Demand | ఎక్స్ ప్రెస్ హైవేపై పోత‌న‌ప‌ల్లె గ్రామ‌స్తుల ధ‌ర్నా

  • తమ గ్రామానికి ఎప్పటి నుంచో ఉన్న దారి పునరుద్ధరించాలని డిమాండ్..
  • తమ ప్లాన్ లో దారిలేదంటూ తేల్చిచెప్పిన గుత్తేదారులు
  • గతంలో వెళుతున్న దారికి అడ్డంగా బారికేడ్లు అమర్చ‌డంతో నిరసనకు దిగిన గ్రామస్తులు

Demand | వి.కోట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని తోటకనుమ పంచాయతీ పోతనపల్లి గ్రామస్తులు ఎక్స్ ప్రెస్‌ హైవే పై ధర్నాకు దిగారు. ఇవాళ‌ ఉదయం వారి గ్రామానికి మునుప‌టి నుంచి వెళ్తున్న రోడ్డుకు అడ్డంగా ఎక్స్ ప్రెస్ హైవే గుత్తేదారులు బారికేడ్లను అమర్చారు. తమ గ్రామానికి రాకపోకలకు అడ్డుగా వీటిని పెట్టడమేమిటని గ్రామస్తులు ప్రశ్నించడంతో మీకు ఇక్కడ రోడ్డుకు అనుమతి లేదని కోటబండ నుంచి వెళ్లే మార్గం నుంచి రాకపోకలు సాగించుకోవాలన్నారు.

దీంతో దశాబ్దాలుగా తమ గ్రామానికి వస్తున్న రోడ్డుపై ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించి అండర్ పాస్ ఎందుకు నిర్మించలేదంటూ వారిని నిలదీశారు. అందుకు తమ ప్లాన్ లో అలా లేదని చెప్పడంతో తమకు రోడ్డు విడిచే వరకు రాకపోకలు సాగించరాదంటూ ఎక్స్ ప్రెస్ హైవేపై గ్రామస్తులు ద్విచక్ర వాహనాలను అడ్డుపెట్టి ధర్నాకు దిగారు.

Demand

ఈ సందర్భంగా పలమనేర్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఈ మార్గంలో ప్రయాణిస్తున్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ధర్నాను గమనించి దిగారు. దీంతో గ్రామస్తులు వారి సమస్యను ఆయనకు విన్నవించగా… ఆయన సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. పూర్వం నుంచి ఉన్న రోడ్డును పునరుద్ధరించాలని.. లేకుంటే సర్వీస్ రోడ్డు అయినా వారికి ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు. వారం రోజుల్లోపు సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. ఎక్స్ ప్రెస్‌ హైవే కోసం ఉన్నదారిని మూసేయడం ఏ మేరకు సమంజసమని పోతనపల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఏదో ప్రకారంగా తమకు దారి వసతి కల్పించకుంటే తిరిగి ఆందోళనకు దిగుతామని అంటున్నారు.

Leave a Reply