Delhi | మిర్చి రైతులను అదుకుంటాం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూ ఢిల్లీ – మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరామమన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో రామ్మోహన్ నాయుడు,కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నేడు భేటి అయ్యారు. మంత్రి అచ్చం నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎపిలో మిర్చి ధరలు పడిపోవడాన్ని ప్రస్తావించారు.. రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకోవాలని రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ న కోరారు..
ఈ సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని పేర్కొన్నారు.. ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రం రూ.11,600 రూపాయలుగా నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు మిర్చి ఎగుమతులు జరగడం లేదు. మిర్చి ఎగుమతులు పెంచడం గురించి కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చించాం. రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సదస్సు పెట్టాలని నిర్ణయించాం. సదస్సు ద్వారా వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా మిర్చి ఎగుమతులు పెంచడంపై దృష్టి పెడతాం’ అని చెప్పారు.