Delhi | అనిల్ అంబానీ కంపెనీల్లో ఈడీ దాడులు..

ఢిల్లీ : వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ (Anil Ambani)కి ఈడీ (Enforcement Directorate) ఊహించని షాకిచ్చింది. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (Anil Dhirubhai Ambani Group) (ఆర్‌ఏఏజీఏ) సంస్థలకు సంబంధించి ముంబై, ఢిల్లీ నగరాల్లోని పలు కార్యాలయాలు, నివాసాల్లో మొత్తం 50చోట్ల ఏకకాలంలో ఉదయం నుంచి ముమ్మురంగా సోదాలు చేపడుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Rcom) లోన్ ఖాతాలను ఫ్రాడ్‌గా తేల్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సోదాలు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జరిగినట్లు తెలుస్తోంది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వంటి ఇతర సంస్థలు కూడా అనిల్ అంబానీ చేసిన మోసాలపై ఈడీకి సమాచారం అందిన నేపథ్యంలో ఈ సోదాలకు అత్యంత ప్రాధాన్యత నెలకొంది.

కాగా, అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024 ఆగస్టులో, సెబీ అనిల్ అంబానీని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (RHFL) నుంచి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఐదేళ్లపాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధించింది. అనిల్ అంబానీతో పాటు 24 ఇతర సంస్థలపై రూ.25 కోట్ల జరిమానా విధించగా, ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఆరు నెలల నిషేధంతో పాటు రూ.6 లక్షల జరిమానా విధించింది. సెబీ దర్యాప్తులో, అనిల్ అంబానీ తన సంస్థలతో సంబంధం ఉన్న సంస్థలకు రుణాల రూపంలో నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply