Death Game – జీవితాలతో ఆట! ఉసురు తీస్తున్న బెట్టింగ్‌లు
ఈజీ మనీ కోసం ఆన్‌లైన్ గేమ్స్
అప్పుల పాలవుతున్న యువత
తీర్చలేక ఆత్మహత్యలు
నెల రోజుల్లోనే ముగ్గురి బలన్మరణం
వీధిన పడుతున్న కుటుంబాలు
కరీంనగర్, ఆంధ్రప్రభ బ్యూరో : స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే ఏల వచ్చు అనే భ్రమలో యువత ఉంటోంది. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అంతకంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఈజీ మనీ భ్రమలో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్, బెట్టింగ్‌ల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
అత్యాశకు పోయి..
పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో యువత పొద్దస్తమానం చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని ఆన్లైన్ ఆటల్లో మునిగి తేలుతోంది. విద్యార్థులు కూడా వీటికి అలవాటు పడి చదువులను నాశనం చేసుకుంటున్నారు. ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అనే భ్రమలో పడి సోషల్ మీడియాలో వస్తున్న యాడ్స్.. వాళ్లను అటువైపు మరలేలా చేస్తున్నాయి. అత్యాశకుపోయిన యువకులు రూ. లక్షలు తగలే స్తున్నారు. అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. తాము నష్టపోతున్నామని తెలుసుకునేసరికి అప్పులు పెరిగిపోయి ఆస్తులకు ఎసరు వస్తోంది. ఈ క్రమంలో కన్నవారితో గొడవలకు దిగుతు న్నారు. డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటనలూ ఉన్నాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి తమ పిల్లల చేతుల్లో డబ్బులు పెడుతున్నారు. ఇంకొందరు కుటుంబ సభ్యులకు సమాధానం చెప్ప లేక, అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్న కొందరు యువకుల కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నెల రోజుల్లో ముగ్గురు యువకులు ఆన్లైన్ గేమ్‌లతో నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. చేతికందిన కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో కన్నవారికి కడుపుకోత మిగులుతోంది. ఇదే సమయంలో అప్పులు తీర్చ డం. కుటుంబాన్ని పోషించడం వారికి భారంగా మారుతోంది. అప్పులు తీర్చలేక కొందరు ఆత్మ హత్య చేసుకోగా.. మరికొందరు బిషాణా ఎత్తేశారు. దీంతో వారికి అప్పులు ఇచ్చినవారు లబోదిబోమంటున్నారు.
ముందు నష్టాలు.. లాభాలు..
ఇంటర్‌నెట్‌లో ఏదైనా సైట్ ఓపెన్ చేయగానే అందులో ఓ పక్కన ఆన్ లైన్ రమ్మీ, క్యాసినో, రౌలట్ లాంటి గ్యాబ్లింగ్ ఆటలు అనేకం కనిపిస్తుంటాయి. వీటికి అట్రాక్ట్ అయి సరదాగా ఆడడం మొదలుపెడితే ప్రారంభంలో డబ్బులు వచ్చేలా చేసి ఆశ పుట్టిస్తారు. ఆ తర్వాత నాలుగైదుసార్లు డబ్బులు పోగొట్టుకుంటే.. ఒకటి, రెండు సార్లు డబ్బులు లాభం వచ్చేలా చేసి మళ్లీ ఆశ కల్పిస్తారు. ఇలా సాఫ్ట్ వేర్ లోనే సెట్ చేసి పెడతారు. ఇందులో లాభాలు రావడం కంటే నష్టపోయినవాళ్లే వేలాదిగా ఉంటారు. చాలామంది యువకులకు ఇదొక వ్యసనంగా మారడంతో రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ కోసం లోన్ యాప్ నుంచి, తెలిసినవారి నుంచి, క్రెడిట్ కార్డుల నుంచి అప్పులు చేయడం.. చివరికి అవి తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడం చాలాచోట్ల జరుగుతోంది. ఆస్తులేవి లేని యువకులు డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
జిల్లాలో ఇటీవల జరిగిన వరుస ఘటనలు..
- కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన బూస శంకర్ కుమారుడు కార్తీక్ (25) కొన్నాళ్లు ఆన్‌లైన్‌లో నాలుగు సార్లు రమ్మీ ఆడాడు. గేమ్ కోసం రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో ఆరు నెలల కింద 20 గుంటల పొలం అమ్మి అప్పు తీర్చేశాడు. తర్వాత మరోసారి రూ. 2.50 లక్షలు అప్పు చేసి రమ్మీ ఆడడంతో ఆ డబ్బులు కూడా పోయాయి. దీంతో మనస్తాపానికి గురైన కార్తీక్ జనవరి 30న గ్రామ సమీపంలోని వాగు వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
- శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎడిగ మధు(33) కొన్నినెలలుగా ఆన్ లైన్ బెట్టింగ్ ఆడుతూ రూ.10 లక్షలకుపైగా పోగొట్టుకున్నాడు. అప్పులు చేసి బెట్టింగ్‌లో పెట్టడంతో అవి చెల్లించలేక కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నెల 10న ఇంట్లో ఎవరూ లేని టైంలో గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. గతం ఒకసారి ఇతను బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు.
- వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన గుమ్మడి రిషివర్ధన్(18) తన మొబైల్‌కు వచ్చిన ఆన్లైన్ ట్రేడింగ్ మెస్సేజ్ పై క్లిక్ చేశాడు. మొదట రూ.5 వేలు సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపాడు. దీనిపై డబుల్ అమౌంట్ పొందాలంటే రూ.23,500 పెట్టుబడి పెట్టాలంటూ వారు మెలిక పెట్టడంతో ఆ డబ్బు చెల్లించాడు. మూడో టాస్క్ లో రూ.68 వేలు పెట్టుబడి పెడితే మొత్తం రీఫండ్ వస్తుందని నమ్మించడంతో ఆ మొత్తం కూడా పంపాడు. ఆ డబ్బులకు రెట్టింపు పొందాలంటే మళ్లీ రూ.2.06 లక్షలను ట్రాన్స్ఫర్ చేయాలని మెసెజ్ రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించి మనస్తాపానికి గురై డిసెంబర్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు.
- పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లయిన్ కాలనీకి చెందిన చొప్పరి దేవేందర్ (35) కార్లను అద్దెకు నడుపుతుండటమే కాకుండా, జూలపల్లిలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడి రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. అంతేగాక రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన దేవేందర్ ఆదివారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు.