TTD | తిరుమలలో రథసప్తమి … 4న సిఫారసు లేఖల దర్శనాలు రద్దు
తిరుమల – ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రథసప్తమి రోజున సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాలక మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
అలాగే రథసప్తమి రోజున శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సిఫారసు లేఖల దర్శనాల రద్దుతో పాటు, తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు కూడా రద్దు చేస్తున్నట్టు వివరించారు. నేరుగా వచ్చే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అనుమతిస్తామని వెల్లడించారు. పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.
మాఢవీధుల్లో వాహన సేవలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మాఢ వీధుల్లో భక్తులకు ఎండ, చలి నుంచి రక్షణకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రథసప్తమికి భారీగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని 8లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రథసప్తమి పర్వదినం సందర్భంగా 2లక్షల మందికి పైగా భక్తులు తిరుమల వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై శ్రీవారు విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు.