డల్లాస్ : నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా తెలంగాణ కలగన్న కేసీఆర్.. ఒకే ఒక్కడిగా బయల్దేరారని, ఎన్నో అవమానాలను అధిగమించి తెలంగాణను సాధించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మార్పులకు అనుగుణంగా.. కేసీఆర్ తీసుకున్న ప్రతి సంక్షేమం, విధానం కింద మానవీయ కోణం ఉందననారు. కేసీఆర్ కిట్‌తో శిశు, మాతృ మరణాలు తగ్గాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుంచి నేను వెళ్తా గవర్నమెంట్ హాస్పిటల్‌కు అన్న స్థితికి తీసుకువచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ సర్కార్ అని. విదేశీ స్కాలర్‌షిప్‌లతో విదేశీ విద్యకు అవకాశం కల్పించామని కెటిఆర్ గుర్తు చేశారు..
ఎందరో ప్రాణత్యాగంతోనే ..
అమెరికాలోని డల్లాస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు, బీఆర్‌ఎస్ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఎన్నారైలు పెద్దసంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే.. దశాబ్దాలుగా కొట్లాడితే తెలంగాణ వచ్చిందని చెప్పారు. పోరాడి సాధించిన యోధుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో అదే కసి.. స్ఫూర్తితో పనిచేశామన్నారు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నామని చెప్పారు. మూడేండ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని వెల్లడించారు.
‘ మిమ్మల్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తున్నది. ఖండాలను దాటి తెలంగాణ నైపుణ్యాన్ని చాటిన మీ అందరికీ వందనం. తెలంగాణకు ప్రతీకగా నిలిచిన మీ అందరికీ అభివందనం. అమెరికాలోని తెలంగాణవాసులను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నది. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మను మరచిపోలేదు. బతుకును ఇచ్చిన తెలంగాణను మీరు మరచిపోలేదు. దశాబ్ద కాలంగా ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఇప్పుడూ అలాగే కనబడుతున్నది. నిన్నటి వరకు తెలుగు వారికి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నా.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్‌లో ఉందని. అమెరికాలో ఉన్నట్లు ఎంతమాత్రం అనిపించడం లేదు. 2015లో పెట్టుబడుల కోసం అమెరికాలో తిరుగుతూ డాలస్‌కు వచ్చాం. పదేండ్ల తర్వాత ఇక్కడకు వచ్చి చూస్తే కేసీఆర్ దూతలుగా ఎన్నో చేసి చూపించారు. జీవితంలో ఎన్నో కలలు కంటారు. కొందరు వాటిని సాకారం చేసుకుంటారు. 2001లో నాలుగు కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్ తెలంగాణ కలగన్నారు. ఒకే ఒక్కడిగా బయల్దేరారు. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్డండన్నారు. శూన్యం నుంచి బయల్దేరి అందరినీ ఏకం చేసి తెలంగాణను సాధించారు. విదేశీ గడ్డపైనా జై తెలంగాణ అని నినదించారు. ఎన్నో అవమానాలను అధిగమించి తెంగాణను సాధించారు. మేం బాధ్యతగా భావించడంతోనే అనితర సాధ్యమైన విజయాలు చేకూరాయి. స్వరాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలుపుకోవడంలో ఏ అవకాశాన్ని వదులుకోలేదు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నాం. మళ్లీ మూడేండ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు చేరుతుంది. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే.. దశాబ్దాలుగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. పోరాడి సాధించిన యోధుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో అదే కసి.. స్ఫూర్తితో పనిచేశామని కెటిఆర్ పేర్కొన్నారు
అదే తెలంగాణ స్టైల్..
2014 జూన్ 2న అసాధ్యమైనది సుసాధ్యం చేసిన రోజు. 60 ఏండ్ల కల నిజమైన రోజు. దశాబ్దాల ఆశయాలు, ఆశలు, ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అనతికాలంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. పదేండ్ల పాలనలో వలసలను నివారించి విముక్తికలిగించాం. కేసీఆర్ ఆలోచనలు, ఊహలు కొందరికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. ఉద్యమ సమయంలోనే తెలంగాణను ఓ రూపంగా నిలుపుకున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ అద్భుతమైన అక్షయపాత్రగా అవతరించింది. తలసరి ఆదాయం రూ.1.12 లక్షల నుంచి రూ.3.56 లక్షలకు చేరింది. దేశంలోనే ఆర్థికాభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలిపాం. 8 ఏండ్లలోనే 10 శాతం పేదరిక నిర్మూలన జరిగింది. అప్పులు చేసి ఆదాయాన్ని పోగుచేసి పేదలకు, ప్రజలకు పంచాం. ఎప్పుడూ మితిమీరి అప్పులు చేయలేదు. ఆర్థిక క్రమశిక్షణ వల్ల అప్పుల్లో కింది నుంచి ఆరో స్థానంలో ఉన్నాం. కరోనా కాలంలోనూ తెలంగాణను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాం. ఆనాడు కరెంటు కోతలతో ప్రజలు సతమతమయ్యారు. విద్యుత్ సంస్కరణలు చేపట్టి సమస్యను పరిష్కరించామన్నారు కెటిఆర్ .
45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అక్షయ పాత్ర కాళేశ్వరం
కేసీఆర్ విప్లవాత్మకమైన అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టారు. తుంగతుర్తి, డోర్నకల్, మహబూబ్‌సాగర్‌కు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం వల్లనే. నాలుగేండ్లలోనే కాళేశ్వరం నిర్మించిన ఘటన కేసీఆర్‌కు దక్కుతుంది. 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అక్షయ పాత్ర కాళేశ్వరం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. 371 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని విషప్రచారం చేశారు. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి వాడుకలోకి తేవాలని కోరుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడుభూములకు సైతం నీళ్లు మళ్లించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 10 శాతం పనులు మిగిలిపోతే పూర్తిచేయడం లేదు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే మిగిలిన పనులను పూర్తి చేయడం లేదు. కోటిన్నర ఎకరాల్లో పంటలను పండించి వ్యవసాయ విస్తరణ సాధించాం. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాలను తలదన్ని తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. తెలంగాణలో సంపద పెరిగింది. భూములపై ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులు పెట్టారు. బీహార్, జార్ఖండ్, ఒడిశాల నుంచి వచ్చి మన పొలాల్లో పనిచేస్తున్నారు. గ్రామాలు పచ్చగా కళకళలాడితే.. పట్టణాలు అభివృద్ధికి నిలయాలుగా మారాయి. తెలంగాణలోని పల్లెలు 30 శాతం అవార్డులు గెలిచాయి. 27 వేల పైచిలుకు పరిశ్రమలు టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రారంభించబడ్డాయి. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. హైదరాబాద్‌కు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ న్యాయార్క్‌లో ఉన్నానా అని అన్నారు. రూ.57 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్ల వరకు ఐటీ ఎగుమతులు తీసుకెళ్లిపోయాం. దేశానికి తెలంగాణ గుండెకాయ లాంటిది. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు కల్పించామని వివరించారు..
ఆమెరికాలో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసిందని అంటూ . అవసరమైతే లీగల్ సెల్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలబడతామన్నారు కెటిఆర్. విజ్ఞాన ఆధారిత దేశాలు అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. విదేశాల్లో జాబ్స్ పోతాయనే ఆందోళన నెలకొన్నదని అంటూ మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పును సాధించాలన్నారు. ఎదురయ్యే సాంకేతిక సమస్యను ఎదుర్కొని పరిష్కరించుకోవాలని సూచించారు. సంస్థకరణలకు ఆధ్యుడు, ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది పీవీ నరసింహారావు అని ప్రశంసిచారు.. జన్మభూమి రుణం తీర్చుకోండి.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. మీ అందరికీ బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని అన్నారు కెటిఆర్…