CRC | నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు..

- బోయినపల్లి స్కూళ్లలో బాలల హక్కుల కమిషన్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బాలల హక్కుల ఉల్లంఘన లేదా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని బాలల హక్కుల కమిషన్ (Child Rights Commission) హెచ్చరించింది. విద్యార్థుల భద్రత, పాఠశాలల్లో మౌలిక వసతులపై కమిషన్ (CRC) దృష్టి సారించింది. ఈ మేరకు హైదరాబాద్ బోయినపల్లి పరిధిలోని కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి నేతృత్వంలో సభ్యుల బృందం.. సీఎంఆర్ హై స్కూల్, సెయింట్ పీటర్స్, సెయింట్ ఆండ్రూస్ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసింది.
ఈ సందర్భంగా పాఠశాలల్లో తాగునీరు, పారిశుధ్యం, తరగతి గదుల పరిస్థితి, ఫైర్ సేఫ్టీ వంటి మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం అమలు తీరు, పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల ఏర్పాటు, విద్యార్థులపై శారీరక శిక్షల నిషేధం వంటి అంశాలపై కమిషన్ సభ్యులు ఆరా తీశారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అర్హతలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దాలని పాఠశాల యాజమాన్యాలను కమిషన్ ఆదేశించింది.
పిల్లలకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో కమిషన్ సభ్యులు వందనా గౌడ్, అపర్ణ, వాచన్ కుమార్, సరిత, ప్రేమలత పాల్గొన్నారు.


