అందరికీ విద్య, వైద్యం,ఉద్యోగం కోసం సిపీఐ పోరాటం

మునుగోడు, ఆంధ్రప్రభ : అందరికీ సమాన హక్కులతో విద్య,వైద్యం,ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సిపీఐ నిరంతరం పోరాటం చేస్తోందని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుజా రామచంద్ర పేర్కొన్నారు.ఇంటింటికి సిపీఐ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో పార్టీ కరపత్రాలను పంచుతూ ప్రజలకు సిపీఐ చేసిన సేవలు,పార్టీ అవసరాన్ని వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులను సమానంగా పంచి,ప్రజలకు విద్య, వైద్యం,నివాస సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తేనే నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు.అలాంటి సమసమాజ నిర్మాణం కోసం సిపీఐ కట్టుబడి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
మతం,కులం, ప్రాంతం పేరుతో రాజకీయ లాభాల కోసం పనిచేసే పార్టీలను ప్రజలు గుర్తించి, సమానత్వం కోసం పోరాడే సిపీఐకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,జిల్లా కౌన్సిల్ సభ్యులు బిలాలు,మండల కార్యవర్గ సభ్యులు వనం వెంకన్న,శాఖ కార్యదర్శి బైరుగొండ వెంకన్న, గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు పగిలి రమేష్, వనం శ్రీను,గూడెం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
