WGL | ప్రేమజంటపై అమ్మాయి బంధువుల దాడి

నల్లబెల్లి, జూన్ 5(ఆంధ్రప్రభ) : పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటపై, అలాగే అబ్బాయి బంధువులపై సుమారు 50మంది అమ్మాయి బంధువులు దాడికి దిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన అబ్బాయి బంధువైన సముద్రాల బాలరాజు ఇంట్లో తలదాచుకున్న విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రెండు వాహనాల్లో సుమారు 20మంది చేరుకొని బాలరాజు లేని సమయంలో అతని భార్యతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.

గ్రామస్తులు అడ్డుకోవడంతో అమ్మాయి బంధువులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రాణ రక్షణ కోసం ప్రేమజంట నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. దాడికి పాల్పడ్డ సంఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అమ్మాయి బంధువులు సుమారు 50మంది ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి పోలీసు రక్షణలో ఉన్న ప్రేమజంటపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ప్రేమజంటకు ఆశ్రయం కల్పించిన కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పూలకుండీలతో దాడికి పాల్పడ్డారు. దాడిని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణ, మరో కానిస్టేబుల్ వేణుపై అమ్మాయి బంధువులు పిడి గుద్దులు గుద్దుతూ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సముద్రాల స్వాతి అనే మహిళ తీవ్రంగా గాయపడడంతో పోలీసులు108 వాహనంలో చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ సాయి రమణ హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Leave a Reply