వీధి కుక్క దాడి…

వీధి కుక్క దాడి…
గాయపడ్డ యువకుడు ప్రవీణ్..
వీధి కుక్కల నివారణకు ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేసి ప్రజలను కాపాడాలి
చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : చిలకలూరిపేటలో వీధి కుక్కల బెడద మరోసారి తీవ్ర రూపం దాల్చింది. సుగాలి కాలనీకి చెందిన యువకుడు ప్రవీణ్ తన ఇంటి దగ్గర నడుస్తుండగా ఒక వీధి కుక్క అతనిపై దాడి చేసి ముఖం, పెదవుల వద్ద తీవ్ర గాయాలు చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ప్రవీణ్ ఏమరుపాటుగా ఉండగా కుక్క హఠాత్తుగా దూకి కాటేసింది.
అతని అరుపులు విని పరుగెత్తి వచ్చిన స్థానికులు కుక్కను తరిమేశారు. రక్తపు మడుగులో కూరుకుపోయిన ప్రవీణ్‌ను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు వీధి కుక్కల సమస్యపై అధికారులను తీవ్రంగా నిలదీశారు. కుక్కలను నియంత్రించి సంతానోత్పత్తి నియంత్రణ చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా, ఆచరణలో ఎలాంటి చర్యలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సుగాలి కాలనీలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. పిల్లలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. “అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి” అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల డిమాండ్:
- వీధి కుక్కలను వెంటనే పట్టుకోవాలి
- స్టెరిలైజేషన్ (ABC) కార్యక్రమం సీరియస్‌గా అమలు చేయాలి
- యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
ప్రభుత్వ వినూత్నంగా ఆలోచించి సామ,దాన, దండోపాయాల సామెతగా ఆలోచన చేసి సత్వర పరిష్కారానికి నాంది పలకాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం చట్టపరంగానే అన్ని సమస్యలు పరిష్కారం కావని మానవత దృక్పథంతో ఆలోచించాలని పబ్లిక్ లో డిమాండ్ పెరుగుతుంది. ప్రజలు సమస్య పరిష్కారం తమ చేతుల్లోకి తీసుకోక ముందే ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
