మక్కకు దళారులే దిక్కా..?

మక్కకు దళారులే దిక్కా..?

ముందుకు కదలని మార్కెటింగ్ మార్క్ ఫెడ్ అధికారులు
సాగు విస్తీర్ణం పెరిగినా కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం
మానుకోటలో మక్క కొనుగోలు కేంద్రాలు లేనట్లేనా..?

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఈ ఏడాది మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో మిర్చి,పత్తి పంట సేద్యం చేసిన రైతులు పెద్ద ఎత్తున ఆర్ధిక అధోగతి పాలయ్యారు. ప్రకృతి వైపరీత్యాలు సైతం మిర్చి,పత్తి రైతు పంటలకు శాపంగా మారాయి.ఈ సమయంలో రబీ సీజన్లో మానుకోట జిల్లా రైతులు మక్కల సేద్యం వైపు రైతులు మక్కువ చూపి అధిక విస్తీర్ణంలో సాగును పెంచారు.కానీ ఈ తరుణంలో రైతులకు సాగు చేసి చేతికొచ్చిన మక్కకు దళారులే దిక్కువుతున్నారు.ప్రభుత్వం జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యాల కారణంగా మొక్కజొన్న రైతుకు దళారులే దిక్కు అవుతున్నారు.

మక్క కొనుగోలు కేంద్రాల జాడేలేదు

జిల్లాలో ఎక్కడా కూడా మార్కెట్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కనీస మద్దతు ధర రూ.2,400 లు ఉండగా రూ.17,00లు మాత్రమే దళారులు చెల్లిస్తున్నారని రైతులు చెబుతూ తద్వారా నష్టపోతున్నామని వెంటనే మార్కెటింగ్ శాఖ వారు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మానుకోట రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అత్యధికంగా పెరిగిన మక్కసాగు

జిల్లాలో 1,00,7470 ఎకరాల్లో మక్క సాగు చేశారు.నర్సింహులపేట మండలంలో 4,150 ఎకరాలు చేశారు.రైతులు అవసరాల కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి నెలకొంది.వెంటనే ప్రభుత్వం, పాలనా అధికారులు స్పందించి మక్క కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది

నేను రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగుచేశాను.ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది.వారు తక్కువ ధరకు అడుగుతున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోవాల్సి వస్తుంది.

చెన్నబోయిన యాకయ్య.. నర్సింహులపేట రైతు

Leave a Reply