కృష్ణా ఫార్మర్స్ సొసైటీకి నూతన దిశ…

కృష్ణా ఫార్మర్స్ సొసైటీకి నూతన దిశ…
ఆధునికీకరణతో రైతు సేవల్లో మరింత వేగం
సర్వసభ్య సమావేశంలో కెడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం
రూ.49.27 లక్షల డివిడెండ్ల పంపిణీ
లాభాల్లో, రుణ వ్యాపారంలో గణనీయ పురోగతి
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేటలో కృష్ణ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆధునికీకరణ దిశగా కీలక అడుగు వేసింది. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఆధునిక భవనాన్ని ప్రారంభించి, రైతులకు మరింత సమర్థవంతమైన సేవలందించే ప్రయత్నాలను అభినందించారు. జగ్గయ్యపేటలోని కృష్ణ ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆవరణలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వ్యవసాయ సహకార రంగంలో కీలక మలుపుగా నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కెడీసీసీబీ) చైర్మన్ నెట్టెం రఘురాం ఆధునికీకరించిన సొసైటీ భవనాన్ని ప్రారంభించారు.
భవనంలో చేపట్టిన సదుపాయాల విస్తరణ, సేవల మెరుగుదలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు చేపట్టిన ఈ చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సొసైటీ చైర్మన్ యానాల గోపీచంద్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.

సమావేశంలో భాగంగా 2021–22 నుండి 2023–24 ఆర్థిక సంవత్సరాల వరకు చెందిన డివిడెండ్లను 2,926 మంది సభ్యులకు రూ.49,27,420 మేర పంపిణీ చేశారు. సంఘ ఆడిట్ నివేదికను ఆమోదించగా, సంస్థ ఆర్థికంగా స్థిరంగా ముందుకు సాగుతోందని చైర్మన్ గోపీచంద్ వివరించారు. కెడీసీసీబీ చైర్మన్ రఘురాం మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో సొసైటీ రూ.1.36 కోట్ల లాభాలు నమోదు చేసిందని వెల్లడించారు.

ఇప్పటివరకు రూ.9 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి, రూ.45 కోట్ల రుణ వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించినట్లు తెలిపారు. ఈ పురోగతికి పాలకవర్గం, సిబ్బంది కృషి ప్రధాన కారణమని అభినందించారు. రైతు సంక్షేమం దృష్ట్యా సకాలంలో రుణ చెల్లింపులకు వడ్డీ రాయితీ, అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష వరకు, ప్రమాద మరణాలకు రూ.2 లక్షల వరకు బీమా సదుపాయాలు అందిస్తున్నట్లు వివరించారు.

అదనంగా వడ్డీ మాఫీ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచి, 60:40 నిష్పత్తిలో బ్యాంక్-సొసైటీ భాగస్వామ్యంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, డిమాండ్ ఆధారిత పంటలు, నీటి సమర్థ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా మద్దతు అందిస్తోందని చెప్పారు. గండ్రాయి సంఘం విలీనంపై సభ్యుల అభ్యర్థన మేరకు తిరిగి విభజన చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ, పిఎసిఎస్ అధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, కట్టా వెంకట నరసింహారావు, దూళిపాళ్ల లక్ష్మణరావు, మాజీ అధ్యక్షులు వెలమాటి చంద్రమౌళి, రైతు ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా ఫార్మర్స్ కోపరేటివ్ సొసైటీ ఆధునికీకరణతో రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని, కెడీసీసీబీ సహకారంతో ఈ దిశగా మరింత పురోగతి సాధిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.

