కాంగ్రెస్ విజయం ఖాయం – మంత్రి పొన్నం

  • నాయి బ్రాహ్మణ సమాజం ఏకగ్రీవ మద్దతు
  • జీరో బిల్లులు తెస్తాం.. నాది బాధ్యత
  • కుల వృత్తులు నాముషి కాదు, మన గౌరవం

జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ : ఎర్రగడ్డ డివిజన్‌లో నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్* కు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు.

ఈ స‌మావేశం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… నాయి బ్రాహ్మణ సమాజ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు పూర్తిగా అందేలా జీరో బిల్లులుగా చేస్తాం అని మంత్రి ప్ర‌క‌టించారు. ఎవరైనా బకాయిల కారణంగా కనెక్షన్ కట్ చేస్తే, దానికి నేనే బాధ్యత వహిస్తా అని భ‌రోసా ఇచ్చారు.

తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌లో నాయీ బ్రాహ్మణ సంఘానికి 10 గుంటల స్థలం, రూ.10 లక్షల నిధులు కేటాయించి భవనం నిర్మించామని గుర్తుచేశారు. కుల వృత్తులు నాముషి కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని స్వీకరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

మన వృత్తి మన గౌరవం. మన పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి అని మంత్రి పిలుపునిచ్చారు. సెలూన్లను ఆధునీకరించేందుకు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. నాయీ బ్రాహ్మణ వృత్తి అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తానని మంత్రి పొన్నం భరోసా ఇచ్చారు.

బలహీన వర్గాల పిల్లలకు అవకాశం ఇచ్చే పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని.. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ అభ్యర్థిగా నిల‌వ‌డం దానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అయిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అభివృద్ధికి అంకితంగా పనిచేస్తార‌ని తెలిపారు. తాను హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రిని కాబట్టి, మీ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తా అని మంత్రి తెలిపారు.

కుల అసమానతలు, విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని సూచిస్తూ.. నవీన్ యాదవ్ గెలుపు మన గెలుపుగా భావించి కృషి చేయాలి. వచ్చే మూడు రోజులు ప్రతి ఒక్కరూ శ్రమించి నవీన్ యాదవ్‌ను ఘనవిజయంతో గెలిపిద్దాం అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు.

Leave a Reply