DEAD | మృతదేహంతో ఆందోళన

మృతదేహంతో ఆందోళన
DEAD | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వైద్యుల నిర్లక్ష్యంతో సంతోష్ కుమార్ (44) మృతి చెందాడని, మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు.
డాక్టర్లు సరైన సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం మూలంగానే ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ బాధిత బంధువులు వైద్యశాల ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేసే వరకూ కదిలేదు లేదని ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో దవాఖాన వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
చికిత్స అందకే మృతి
మృతుడి బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్ 20 ఏళ్లుగా ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20 సాయంత్రం తన విధులు నిర్వహించుకుని దవాఖాన నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఇస్మాయిల్ ఖాన్ పేట దాటిన తర్వాత సంతోష్ బైక్ ను దౌల్తాబాద్ వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొంది.
ఈ ప్రమాదంలో సంతోష్ నుదుటి పై గాయాలు కాగా ప్రభుత్వ దవాఖానలో ప్రాథమిక చికిత్స తీసుకుని తాను విధులు నిర్వర్తిస్తున్న ఎంఎన్ఆర్ వైద్యశాలలో చేరాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరినా సరైన చికిత్స అందకపోవడంతోనే సంతోష్ మరణించాడని మృతుడి బంధువులు, మిత్రులు ఎంఎన్ఆర్ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు.
మృతుడు సంతోష్ తో పాటు ఆయన భార్య సంగీత సైతం ఎంఎన్ఆర్ సంస్థలో పదేండ్ల పాటు ఉద్యోగం చేసిందని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాను పని చేస్తున్న దవాఖానలో తనకు సరైన వైద్యం అందిస్తారని నమ్మి వస్తే.. వైద్యులు సకాలంలో సరైన వైద్యం అందించక నిండు ప్రాణాన్ని బలిచేశారని ఆరోపిస్తున్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించారు. ఆస్పత్రి యాజమాన్యం న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని సమాచారం
