రేషనలైజేషన్ పూర్తి చేయండి…

  • నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓలకు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈఆర్ఓలు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో రేషనలైజేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియలో ప్రతిపాదించిన కేంద్రాలను స్వయంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం ధృవీకరించి ప్రతిపాదనలు సమర్పించాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓలను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1629 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో ఐదు కేంద్రాల పేర్లను శ్రీశైలం నియోజకవర్గంలో 4, బనగానపల్లె నియోజకవర్గంలో ఒక కేంద్రము ను మార్చడం జరిగిందన్నారు.

36 పోలింగ్ కేంద్రాల మార్పుకు ప్రతిపాదనలు అందాయన్నారు. వీటిలో ఆళ్లగడ్డ-9, శ్రీశైలం-6, నంద్యాల-13, బనగానపల్లె-1, డోన్-7 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఇక నూతనంగా 113 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని, వీటిలో ఆళ్లగడ్డ-13, శ్రీశైలం-8, నంద్యాల-48, బనగానపల్లె-29, డోన్-5, నందికొట్కూరు-10 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. కొత్త కేంద్రాలు ఏర్పాటయ్యాక జిల్లాలో మొత్తం 1742 పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.

కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సమయంలో ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు కేంద్రాల్లో ఉండకుండా, అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే నూతన పోలింగ్ కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలలు లేదా కళాశాలల భవనాల్లో ఏర్పాటు చేయకూడదని, రాజకీయ పార్టీ ప్రతినిధులతో అనుబంధం ఉన్న ప్రైవేటు స్థలాలను ఉపయోగించరాదని స్పష్టం చేశారు.

పిఆర్‌పి యాక్ట్ 1950, సెక్షన్ 13(బి) ప్రకారం బిఎల్ఓలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బిఎల్ఓలు సరైన రీతిలో విధులు నిర్వర్తించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటర్ల జాబితాలో నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలను ఎన్నికల నిబంధనల మేరకు జాగ్రత్తగా చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఎన్నికల విభాగానికి సంబంధించిన ఆపరేటర్ పోస్టుల భర్తీని త్వరితగతిన పూర్తి చేసే చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.

ఎమ్మెల్యే ఇంటి పక్కనే పోలింగ్ కేంద్రం

రాజకీయ పార్టీ ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆళ్లగడ్డలో ఉన్న ఒక పోలింగ్ కేంద్రం స్థానిక శాసనసభ్యుని ఇంటి సమీపంలో ఉందని, దానిని మార్పు చేయాలని కోరారు. పాండురంగాపురం–బాపూజీ నగర్ ప్రాంతంలో సుమారు 1200 మంది ఓటర్లు ఉన్నందున అక్కడ ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. పోలింగ్ కేంద్రాల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఉండేలా చూడాలని సూచించారు. రాబోయే ఎన్నికల సమయంలో గర్భిణీ స్త్రీలకు హోమ్ ఓటింగ్ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, శివనాగజ్యోతి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులైన కాంగ్రెస్ పార్టీ తరపున సయ్యద్ రియాజ్ బాషా, వైయస్సార్సీపి తరఫున సాయిరాం రెడ్డి, టిడిపి తరఫున ప్రసాద్ రెడ్డి, శివరాం రెడ్డి బిజెపి తరఫున కసెట్టి చంద్రశేఖర్, సిపిఐ తరపున నరసింహులు, బహుజన సమాజ్ పార్టీ తరఫున కె. శ్రీనివాసులు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply