Committee | వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Committee | వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

  • పూర్ణాహుతి, చక్రస్నానంతో ఉత్సవాలు పరిసమాప్తం..
  • ఇంద్రకీలాద్రిపై వేడుకగా మహోత్సవాలు…
  • లక్షల సంఖ్యలో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు..
  • వసంతోత్సవం, ధ్వజారోహణంతో ముగిసిన వేడుకలు

Committee | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా, భక్తి పరవశ్యంలో మంగళవారం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు మంగళవారం పాత యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమం వేదమంత్రాల సాక్షిగా అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు మండప పూజ, మూలమంత్ర హవనం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఉదయం 9:30 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతి ఘట్టంలో ఆలయ స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ ఆధ్వర్యంలో వైదిక కమిటీ వేద పండితులు శాస్త్రోక్తంగా యజ్ఞ క్రతువును నిర్వహించారు. యజ్ఞ ఫలాన్ని లోక కల్యాణార్థం అగ్నిదేవునికి సమర్పిస్తూ మహా క్రతువును ముగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Committee |

పూర్ణాహుతి అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఉరేగింపు మెట్ల మార్గం గుండా దుర్గా ఘాట్ వరకు కనుల పండువగా సాగింది. అక్కడ పవిత్ర కృష్ణా నదిలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఈ.ఓ, పాలక మండలి సభ్యులు, సిబ్బంది భక్తులతో కలిసి రంగులు చల్లుకుంటూ వసంతోత్సవంలో పాల్గొని ఉత్సవ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

Committee |

ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, స్థానాచార్యులు వి. శివప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. వసంతోత్సవం అనంతరం అవభృతోత్సవం (చక్రస్నానం) కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చివరగా ధ్వజారోహణం ద్వారా పవిత్ర ధ్వజపటాన్ని దించి ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారికంగా ముగింపు పలికారు. మల్లేశ్వర స్వామి నామస్మరణతో కృష్ణా తీరం మార్మోగగా, భక్తుల జయజయధ్వానాల నడుమ ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది.

Committee |

మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. శాంతిభద్రతలు, సౌకర్యాల ఏర్పాట్లలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతంగా ముగించారని అధికారులు తెలిపారు.

click here to read more : Tirumala| శ్రీ‌వారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌..

click here to read more

Leave a Reply