Collision | నల్లగొండలో డిష్యుం డిష్యుం..

Collision | నల్లగొండలో డిష్యుం డిష్యుం..
- బీజేపీ కార్యాలయం వద్ద ఘర్షణ
- వాజ్ పేయి జయంతి వేడుకల్లో బీసీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ పై భౌతిక దాడి
- పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దౌర్జన్యం నశించాలంటూ పార్టీ కార్యాలయం ఎదుట రామరాజు యాదవ్ ఆందోళన
- ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు కెమెరాలు లాక్కొని చిప్పును ఫార్మాట్ చేసిన నాగం వర్షిత్ రెడ్డి
- నాగం రౌడీయిజాన్ని ఖండిస్తూ జర్నలిస్టుల ఆందోళన
Collision | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయం గురువారం రణ రంగంలా మారింది. మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలను పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బిజెపి నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్‌ల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిన పకీరు మోహన్ రెడ్డి ఒక్కసారిగా మీదికి వచ్చి పిల్లి రామరాజు యాదవ్ పై పిడి గుద్దులు గుద్దాడు. పక్కనే ఉన్న నాగం వర్షిత్ రెడ్డి ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా మోహన్ రెడ్డికి మద్దతు పలికాడని రామరాజు యాదవ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఈ గొడవను రికార్డు చేయగా నాగం వర్షిత్ రెడ్డి మీడియా ప్రతినిధి పై బల ప్రయోగం చేసి కెమెరాను గుంజుకొని చిప్‌ను ఫార్మాట్ చేశాడు.
దీంతో మరోవైపు జర్నలిస్టులు తమపై జరిగిన దాడిని నిరసిస్తూ కార్యాలయం ఎదుట జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మొత్తం ఈ వివాదానికి సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఇటీవల బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుమతి తీసుకొని పిల్లి రామరాజు యాదవ్ అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్ధరాత్రి ఫోన్ చేసి సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేయాలని నాగం వర్షిత్ రెడ్డి ఆదేశించాడని పిల్లి రామరాజు యాదవ్ చెబుతున్నారు. గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో వాజ్ పేయి జయంతి వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో నాగం వర్షిత్ రెడ్డి సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పాడని పిల్లి రామరాజు యాదవ్ చెబుతున్నారు. తనను సన్మాన కార్యక్రమం నిర్వహించవద్దని చెప్పి ఇప్పుడు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవుల మధ్య వివాదం నెలకొంది.

ఈ క్రమంలో పకీరు మోహన్ రెడ్డి రామరాజు యాదవ్ పై దాడి చేశారు. తనపై జరిగిన దాడిని నిరసిస్తూ రామరాజు యాదవ్ జిల్లా పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి 28 వేల ఓట్లను తెచ్చుకున్నానని, బీజేపీపై ఉన్న ప్రేమతో ఈ పార్టీలో చేరానని చెప్పారు. అయితే నాగం వర్షిత్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆయన ఆరోపించారు. ఒంటెద్దు పోకడలతో పార్టీ కోసం కష్టపడే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం తనకు ఎవరు పోటీ ఉండొద్దన్న ఆలోచనతో బలమైన పార్టీ నాయకులను ఉద్దేశపూర్వకంగా వర్షిత్ రెడ్డి దూరం పెడుతున్నాడని ఆరోపించారు. తనపై దాడి చేసిన మోహన్ రెడ్డి పార్టీ నాయకుల సమక్షంలో తనకు క్షమాపణ చెప్పేంతవరకు తన ఆందోళనను విరమించేది లేదని పార్టీ కార్యాలయం లో పిల్లి రామరాజు యాదవ్ భీష్మించుకు కూర్చున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
