గ్యాస్ డెలివరీలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు

గ్యాస్ డెలివరీలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు
వెల్దుర్తి గ్యాస్ గోడౌన్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కర్నూలు బ్యూరో,ఆంధ్రప్రభ : గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి హెచ్చరించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలోని సంపూర్ణ ఇండెన్ గ్యాస్ గోడౌన్‌ను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లో స్టాక్ వివరాలను పరిశీలించిన కలెక్టర్, ప్రతి రోజు ఎన్ని సిలిండర్లు సరఫరా చేస్తున్నారో తెలుసుకున్నారు. స్టాక్ పరిశీలనలో 6 గృహ వినియోగ సిలిండర్లు, 11 వాణిజ్య సిలిండర్లు తక్కువగా ఉండడం గమనించి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే నోటీసులు జారీ చేయాలని జిల్లా సరఫరా అధికారి (డీఎస్ఓ)ను ఆదేశించారు.
గోడౌన్ పరిధిలో అగ్నిమాపక భద్రతా నిబంధనలు సరిగా పాటించకపోవడంపై కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. గ్యాస్ డెలివరీ బాయ్స్‌కు సరైన జీతభత్యాలు చెల్లించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వారికి జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే వినియోగదారుల వద్ద అదనపు వసూళ్లు జరుగుతున్నాయని తెలిపారు. డెలివరీ సమయంలో అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేదని, ప్రస్తుతం సుమారు 18 వేల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ గృహ వినియోగ సిలిండర్లను వంట అవసరాలకు మాత్రమే వినియోగించాలని, గీజర్లు, వాహనాలు లేదా ఇతర అవసరాలకు ఉపయోగించవద్దని ప్రజలకు సూచించారు. గ్యాస్ వినియోగంలో మితవ్యత పాటించాలని తెలిపారు.
ఈ తనిఖీలలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డీఎస్ఓ రాజా రఘువీర్, అగ్నిమాపక శాఖ అధికారి జయసింహ, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాముడు తదితరులు పాల్గొన్నారు.
