Collector Rajakumari | అధికారులు అలర్ట్…

Collector Rajakumari | అధికారులు అలర్ట్…

  • ఈ నెల 29న ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
  • సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100 ఏర్పాటు
  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Collector Rajakumari | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఈ నెల 29న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో అర్జీలను meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు.

అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లో, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు.
అర్జీదారులు మొదట తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయంలోని అధికారులకు అర్జీలు ఇవ్వాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలు మాత్రమే జిల్లా కేంద్రంలోని వేదికకు రావలసిందిగా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు..

29న కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్స్

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు ఈ నెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం తెలిపారు. ఇక్క‌డ ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి సమస్యల పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు హాజరై ప్రజలకు సేవలు అందిస్తారని పేర్కొన్నారు.

రెవెన్యూ, అడంగల్ సవరణలు, 22ఎ–చుక్కల భూముల క్రమబద్ధీకరణ, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలు, రెవెన్యూ కోర్టు కేసులు, సర్వే, రీ సర్వే, దేవాదాయ, వక్ఫ్ భూముల సమస్యలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజల అర్జీలకు వేగవంతమైన పరిష్కారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Leave a Reply