వికారాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రప్రభ): తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ మరమ్మత్తులతో పాటు ప్రహరీగోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఫైల్స్, రికార్డు గదిని కలెక్టర్ పరిశీలించారు.
కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్, ఇతర సామాగ్రిని తొలగించవలసిందిగా తహసీల్దార్ కు కలెక్టర్ సూచించారు. కార్యాలయంలో అవసరాల మేరకు ఫ్యాన్లు సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో దివ్యాంగుల ఉపాధి నిమిత్తం ఏర్పాటు చేసిన స్టాల్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంప్ ను కలెక్టర్ పరిశీలించి కావలసిన సౌకర్యాలను సమకూర్చుకోవాలని డీఆర్డీఓ శ్రీనివాస్ కు కలెక్టర్ సూచించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసు చంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణలు ఉన్నారు.