Collector | బాలల సంరక్షణ కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి…

Collector | బాలల సంరక్షణ కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి…
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
Collector |కర్నూలు, ఆంధ్ర ప్రభ: జిల్లాలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలు, జువెనైల్ జస్టిస్ చట్టం-2015 ప్రకారం సక్రమంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. నిబంధనల అమలులో ఎలాంటి లోపాలు ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిటీ 4 బాలల సంరక్షణ కేంద్రాలను ఆమోదించింది. బాలల భద్రత, ఆరోగ్యం, విద్య, ఆహారం, నివాస వసతి, వంటి అంశాలు అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలన్నారు జిల్లా కలెక్టర్. ప్రైవేట్ బాలల సంరక్షణ కేంద్రాలకు సంబంధించి పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలను తరచు తనిఖీ లు చేయాలన్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కేంద్రాలు అన్నీ సమర్థంగా పనిచేయాలని పేర్కొన్నారు. బాలలపై నిర్లక్ష్యం, సౌకర్యాల లోపం వంటి అంశాలు ఏ సంస్థలోనైనా తలెత్తితే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల భవిష్యత్తు కోసం ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాయిస్ ఫాతిమా, సిపిఒ భారతి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శారద, జిల్లా చైల్డ్ ప్రొహిబిషన్ అధికారి దివాకర్, పోలీస్ శాఖ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
