Collector | బాల్యవివాహాలను నిర్మూలిద్దాం..

Collector | బాల్యవివాహాలను నిర్మూలిద్దాం..
- జిల్లా కలెక్టర్ రాజకుమారి
Collector | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : బాల్యవివాహాలు సమాజానికి శాపమని, ఇవి పిల్లల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హల్ కారిడార్‌లో ప్రజా వినతుల స్వీకరణకు ముందు జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనపై వందరోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాల్యవివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, సామాజిక అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. చట్టప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలులకు వివాహం చేయడం నేరమని స్పష్టం చేశారు. బాల్యవివాహాల నివారణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు. బాల్యవివాహాల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
