సజావుగా పదో తరగతి మూల్యాంకనం..

సజావుగా పదో తరగతి మూల్యాంకనం..
అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రక్రియ
కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం సజావుగా జరుగుతోందని.. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం కేబీఎన్ కళాశాలలోని మూల్యాంకన కేంద్రాన్ని తనిఖీ చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి జరుగుతున్న మూల్యాంకన ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఎగ్జామినర్ల పనితీరును పరిశీలించి.. సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మూల్యాంకన కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా మూల్యాంకన ప్రక్రియ జరిగేలా సూచనలిచ్చారు. మౌలిక వసతులు, భద్రతా చర్యలు, రికార్డుల నిర్వహణ, ట్యాబ్‌ల పనితీరు, మార్కుల నమోదు ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 6న ప్రారంభమైన ప్రక్రియ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరుగుతోందని, కేంద్రం వద్ద చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ వెంట డీఈవో ఎల్.చంద్రకళ తదితరులు ఉన్నారు.
