ధాన్య సేకరణ బకాయిలు విడుదల చేయండి….
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కి రేవంత్ వినతి..
న్యూ ఢిల్లీ – ఆంధ్రప్రభ – 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ నేడు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలసి కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా గతంలో ఉన్న బకాయిలు విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరి గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన చర్చల్లో పిడిఎస్ రైస్ విషయం కోటా పెంచాలని కోరినట్లు సమాచారం. అరగంట పాటు సాగిన ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇక సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ కానున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్-2, రిజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. అనంతరం సీఎం రేవంత్ కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యుర్థులపై వారితో సుధీర్ఘంగా చర్చించనట్లుగా తెలుస్తోంది.