CM Revanth | 18సం.లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలి

CM Revanth | 18సం.లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలి

CM Revanth | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ మహిళా శక్తి కింద ఏకరూప చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Enumula Revanth Reddy) అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయం నుండి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి మహిళకు ఏకరూప చీరల పంపిణీ పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, సెర్ప్ సి ఈ ఓ దివ్య దేవరాజన్‌లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణ అభివృద్ధి అధికారులు, సెర్ప్ అధికారులు, జిల్లా, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ(Indira Gandhi) జయంతి సందర్భంగా ఈ రోజు నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాలలో 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి మహిళకు పారదర్శకంగా చీరల పంపిణీ చేయాలని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు.

జిల్లా మహిళా సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని మహిళలకు ఏకరూప చీరలు పంపిణీ చేయడం మహిళల గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలుపగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, స్పెషల్ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply