CM Relief Fund | బాధితుడికి అండ‌గా..

CM Relief Fund | బాధితుడికి అండ‌గా..

  • ఆపద్భాంధవుడైన‌ ఎమ్మెల్యే యార్లగడ్డ
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి తక్షణ సహాయం

CM Relief Fund | హనుమాన్ జంక్షన్‌, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్యశాలలో చికిత్స పొందేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న యువకుడి పాలిట ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkat Rao) ఆపద్బాంధవుడులా నిలిచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందజేశారు. బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన ముర్రాల ప్రవీణ్( 24) గత నెల 28 వ తేదీ గుడివాడ సమీపంలోని నాగారప్పాడు వంతెన(Nagarappadu Bridge) వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన యువకుడిని గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని స్వర హాస్పటల్ కు తరలించారు. క్షతగాత్రుడికి తక్షణమే ఆపరేషన్(operation) చేయాలని నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రవీణ్ కుటుంబ సభ్యులు కాకులపాడు ఛానల్ డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేశ్‌(Kommareddy Rajesh)ను కలసి ప్రభుత్వం నుంచి సహాయం అందించాల‌ని విజ్ఞప్తి చేశారు.

ఆయ‌న సమస్యను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన స్వర హాస్పటల్(Swara Hospital) యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయంతో సంప్రదింపులు జ‌రిపి రూ.3 లక్షలు సహాయ నిధి మంజూరు చేయించారు. ఈ రోజు ఉదయం ఎల్ఓసీని ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకులపాడు ఛానల్ డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, తిప్పనగుంట గ్రామ పాలకేంద్రం ప్రెసిడెంట్ బుద్దాల రంగారావు, కొడాలి చిట్టిబాబు(Kodali Chittibabu), వేకూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply