CM Press Meet | రెండేళ్ల పాల‌న‌కు ప‌ల్లె ప‌ట్టం..

CM Press Meet | రెండేళ్ల పాల‌న‌కు ప‌ల్లె ప‌ట్టం..

  • పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం
  • 66 శాతం పంచాయ‌తీల్లో జైత్ర‌యాత్ర‌
  • 87 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిక్యం
  • తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప‌ల్లె ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో మా రెండేళ్ల పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మంత్రులతో కలిసి మీడియా సమావేశం (CM Press Meet) నిర్వహించారు సీఎం రేవంత్. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల తీర్పు గత రెండేళ్ల కాంగ్రెస్ ‘ప్రజా పాలన’పై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎలాంటి కక్షసాధింపు చర్యలు లేకుండా, అత్యంత ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా అధికారులను అభినందిస్తూ.. పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

CM Press Meet | 66 శాతం కాంగ్రెస్ కైవసం

రాష్ట్రంలోని మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింద‌ని, పార్టీ మద్దతుతో గెలిచిన 7,527 మంది సర్పంచులతో పాటు, మరో 808 మంది కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కూడా విజయం సాధించారని సీఎం వెల్లడించారు.

ఓవరాల్‌గా 8,335 పంచాయతీల్లో (దాదాపు 66 శాతం) కాంగ్రెస్ జెండా ఎగురవేసి, గ్రామస్థాయిలో తన తిరుగులేని పట్టును మరోసారి నిరూపించుకుందని రేవంత్ రెడ్డి వివరించారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సీఎంను చూసో, మంత్రులను చూసో ఓట్లు వేయరని.. స్థానిక అంశాల ఆధారంగానే తీర్పు ఇస్తారని, ఈ ఫలితం నేరుగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలాన్ని చాటుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

CM Press Meet | 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో…

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 సెగ్మెంట్లలో ఏకంగా 87 చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని ముఖ్యమంత్రి చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు మరో 21 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమైందని ఆయన వివ‌రించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ కేవలం 6 సెగ్మెంట్లలో, బీజేపీ కేవలం ఒకే ఒక్క చోట (ముథోల్) మాత్రమే మెజార్టీ సాధించగలిగాయని ఆయన ఎద్దేవా చేశారు.

Aslo read : Palle Porulo | ప‌ల్లె పోరులో..

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని సీఎం ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేసినప్పటికీ, కేవలం 33 శాతం స్థానాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎన్నికలు నిర్వహించిందని ఆయన స్పష్టం చేశారు. పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే ఈ విజయానికి పునాది అని పేర్కొంటూ, ఇదే ఉత్సాహంతో 2029 ఎన్నికల్లో టూ-బై-థర్డ్ (2/3) మెజార్టీతో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

CM Press Meet | ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించిన త‌ర్వాత‌…

స్థానిక సంస్థల ఎన్నికల గురించి స్పందిస్తూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పట్లో ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే పరిపాలనను సులభతరం చేయడానికే GHMC డీలిమిటేషన్ చేపట్టామని, ఇకపై అభివృద్ధి అంతా ఒక పద్ధతి ప్రకారం సాగుతుందని చెప్పారు.

ఇదే మీడియా చిట్ చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలపై సూటిగా స్పందించారు. పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపాలనే నా మనవడిని మెస్సీ ఈవెంట్‌కు తీసుకెళ్లాను. ఇందులో తప్పేముందన్నారు. మేమేమీ కేసీఆర్ కుటుంబంలా పబ్‌ల చుట్టూ తిరిగేవాళ్లం కాదు. సింగరేణి సంస్థ తన CSR నిధుల నుంచి రూ. 10 కోట్లు ప్రకటనల కోసం ఇచ్చిందని తెలిపారు. ఇక‌, ఫార్ములా–ఈ అంశంపై విచారణ ఇంకా కొనసాగుతోందని సీఎం రేవంత్ తెలిపారు. DoPT నుంచి అనుమతి వచ్చిన వెంటనే అరవింద్ కుమార్‌పై చర్యలు ప్రారంభిస్తాం అని వెల్ల‌డించారు.

ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ మండిపడ్డారు. రాహుల్ గాంధీపై ఉన్న కోపంతో గాంధీ పేరు ఎక్కడా కనిపించకూడదనే దురాలోచనతో కేంద్రం ఇలా చేస్తోందని ధ్వజమెత్తారు. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, స్పీకర్ నిర్ణయాలపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబడుతూ, వారికి రాజ్యాంగంపై కనీస అవగాహన లేదని విమర్శించారు.

Leave a Reply