AP | కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

  • మూడు పార్టీల నేతలు సమన్వయంతో పని చేయాలి

రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కూటమి పార్టీల నేతలంతా నిత్యం సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో ఆయన ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ప్రతి ఎన్నికా పరీక్షలాంటిదేనని, ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయం సాధించాలని సూచించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈనెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులంతా సమష్టిగా పనిచేయాలన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుని, ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు.

ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉందని, మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలని పునరుద్ఘాటించారు. నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పని చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మెరుగ్గా ఉండాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply