శ్రీవారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

  • ఐదు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అరుదైన గౌరవం

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. తన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తో కలిసి వచ్చి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన అరుదైన రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వామివారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించి అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలో లోక కల్యాణం కోసం బ్రహ్మదేవుడిని పిలిచి తనకు ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించారట. బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాడనీ అందుకే వీటికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చిందని ప్రతీతి. తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఈ బ్రహ్మోత్సవాలు చాలా పెద్దయెత్తున, అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున ఇది స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తారు. ఈ ఉత్సవాలు లోక కళ్యాణార్థం నిర్వహించబడతాయి. వెంకటేశ్వర స్వామివారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవడంతో పాటు, పుణ్యఫలాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

1983 నుంచి ఆనవాయితీ..
ఏడాదికి ఒకసారి నిర్వహించే తిరుమల బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతటి విశిష్టత కలిగిన బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 1983 లో ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు ఈ ప్రక్రియలో మార్పులు చేశారు. భద్రాచలం తరహాలో శ్రీవారికి గరుడసేవ రోజు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించే విధానాన్ని తీసుకొచ్చారు.

ప్రారంభంలో గరుడ సేవ రోజు పట్టువస్త్రాలు
అప్పట్లో గరుడసేవ రోజు మాత్రమే పట్టు వస్త్రాలను సమర్పించేవారు. ఇలా సమర్పించిన వస్త్రాలను ఆ రోజే స్వామి వారికి అలంకరించేవారు. ఎన్టీఆర్ తరువాత, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి,చంద్రబాబు నాయుడులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే ఆనవాయితీ ప్రకారం 2003లో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తుంటే అలిపిరి వద్ద నక్సలైట్లు అమర్చిన బాంబు పేలుడుకు చంద్రబాబు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో అప్పటి టీటీడీ చైర్మన్ పప్పుల చలపతిరావు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

మార్పు చేసిన టీటీడీ
ఆ తరువాత 2004 నుంచి పట్టువస్త్రాల సమర్పణ గరుడ సేవ రోజు కాకుండా ధ్వజారోహణం రోజుకు మార్పు చేశారు. గరుడసేవ రోజు వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ధ్వజారోహణం నాడు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తే గరుడసేవ రోజు స్వామి వారికి అలంకరించేందుకు వీలుగా ఉంటుందని టీటీడీ నిర్ణయించింది. ఆ విషయాన్ని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి టీటీడీ అధికారులు తీసుకెళ్లారు. అందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంగీకరించడంతో అప్పటి నుంచి ధ్వజారోహణం నాడు వస్త్రాలు సమర్పించడం సాంప్రదాయంగా మారింది. ఆ తరువాత ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడులు ఇదే సాంప్రదాయంను కొనసాగించారు. అనంతరం సీఎం అయిన వైఎస్ జగన్ సైతం ఇదే సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ధ్వజారోహణం నాడు పట్టు వస్త్రాలు సమర్పించారు.

చంద్రబాబు రికార్డు
2004 నుంచి 2009 వరకు వైఎస్సార్ మాత్రమే వరుసగా ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రికార్డు నమోదైంది. అటు తరువాత సీఎం హోదాలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు సైతం ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్నప్పటికీ ఆయన నాలుగేళ్లు మాత్రమే పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. 47 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు ఈఏడాదితో కలిపి15వ సారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి చరిత్రలోకి ఎక్కారు.

Leave a Reply