కుప్పం : ఏపీలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నెర్వ్ సెంటర్ (Digital Nerve Center) ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి, వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది.
ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పం (Kuppam) ఏరియా ఆస్పత్రితో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. దీనివల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సకాలంలో వ్యాధి నిర్ధారణ, స్పెషలిస్ట్ వైద్యుల అపాయింట్‌మెంట్‌లు, వ్యక్తిగత కౌన్సెలింగ్ (Personal counseling) వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది.
అలాగే అవసరమైన సందర్భాల్లో రోగులకు వర్చువల్ విధానంలోనే వైద్య నిపుణులతో మాట్లాడించి చికిత్స అందించే సౌకర్యం కూడా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలను, ప్రైవేటు ఆస్పత్రులను కూడా ఈ నెర్వ్ సెంటర్ ద్వారా అనుసంధానించుకునే అవకాశం కల్పించారు. స్క్రీనింగ్ టెస్టుల నుంచి చికిత్స అనంతర ఫాలో-అప్‌ల వరకు అన్ని సేవలు ఒకేచోట లభిస్తాయి.ప్రస్తుతం మొదటి దశలో కుప్పంలో ప్రారంభమైన ఈ సేవలను, రెండో దశలో చిత్తూరు జిల్లా (Chittoor District) అంతటికీ, మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంతో ప్రజారోగ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.