closeness2crime | పెరుగుతున్న నేరాల వెనుక నిజాలు

closeness2crime | పెరుగుతున్న నేరాల వెనుక నిజాలు
closeness2crime | పరిచయస్తుల మధ్యే పెరుగుతున్న నేరాలు
ప్రేమ, కుటుంబ విభేదాలు – హింసకు దారి
డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్రభావం
క్షణికావేశం – జీవితాంతం శిక్ష
closeness2crime | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకప్పుడు నేరం అంటే… దూరంగా ఉన్న వాళ్ల మధ్య జరిగేదని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నేటి క్రైమ్ కథలు చూస్తే ఒక నిజం స్పష్టంగా కనిపిస్తోంది. పరిచయం ఉన్నవాళ్ల మధ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బయట పడుతున్న ఘటనలు పరిశీలిస్తే… హత్యల వెనుక ఉన్న కారణాలు చాలా సామాన్యం గానే కనిపిస్తున్నాయి. కానీ ఆ సామాన్య కారణాలే చివరకు అసాధారణమైన దారుణాలకు దారి తీస్తున్నాయి.

పాత కక్షలు… వ్యక్తిగత వైరం… ఇవి కొత్తవి కావు. కానీ ఇప్పుడు అవి మరింత తీవ్రమవుతున్నాయి. చిన్న గొడవలు, చిన్న మనస్పర్థలు కూడా కొంత మందిలో తీవ్రమైన కోపంగా మారి, క్షణాల్లోనే భయంకరమైన హింసకు దారి తీస్తున్నాయి.
ఇక ప్రేమ వ్యవహారాలు, దాంపత్య సంబంధాల విభేదాలు కూడా నేటి నేరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు ప్రేమ విఫలమైతే బాధతో కుమిలిపోయేవారు. అక్కడితో ఆగిపోయేవారు. ఇప్పుడు మాత్రం ఆ బాధ ప్రతీకారంగా మారి ప్రాణాలు తీసే స్థాయికి చేరుతోంది.

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఘటన సమాజంలోని ఈ మార్పుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడిన ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చి… చివరకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. పరిచయం ఎంత వేగంగా పెరిగిందో… అంతే వేగంగా అది ప్రతీకారంగా మారింది.
కుటుంబ కలహాలు కూడా నేటి నేరాల్లో ప్రధాన కారణంగా మారుతున్నాయి. చిన్నచిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారి, ఆగ్రహావేశంలో తీసుకున్న నిర్ణయాలు తిరుగులేని నష్టాన్ని మిగులుస్తున్నాయి. “ఒక్క క్షణం ఆలోచించి ఉంటే…” అనే మాటలు తరువాత వినిపిస్తున్నా… అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది. జరగకూడని ఘోరాలు జరిగిపోతున్నాయి.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఈ హత్యలలో చాలా వరకు బాధితుడు, నిందితుడు ఒకరికి ఒకరు పరిచయస్తులే. స్నేహితులు, ప్రేమికులు, బంధువులు, ఇవే ఇప్పుడు నేరాలకు వేదికలుగా మారుతున్నాయి.
డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా కూడా ఈ పరిణామంలో తమ పాత్ర పోషిస్తున్నాయి. అపరిచితులతో పరిచయం సులభమవడం ఒక వైపు అవకాశమైతే… మరోవైపు అదే ప్రమాదానికి ద్వారంగా మారుతోంది. ఎవరు నిజమైన వారు? ఎవరు నటిస్తున్న వారు? అన్నది గుర్తించడం చాలా కష్టంగా మారింది.
పోలీసులు నిఘా పెంచుతున్నారు. సీసీ కెమెరాలు, సైబర్ ట్రాకింగ్, స్పెషల్ టీమ్స్—అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ నేరాలు తగ్గడం లేదు. కారణం… నేరాల స్వరూపమే మారిపోతోంది. నేరాల్లో కొత్త పద్ధతులు, కొత్త కారణాలు, కొత్త టెక్నాలజీ, ఇవన్నీ కలిసి క్రైంను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. దర్యాప్తును క్లిష్టంగా మారుస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో సమాజం కూడా మారాలి. ఎదుటివారితో ఏవైనా సమస్యలు వస్తే మాట్లాడుకోవాలి… పరిష్కారాలు వెతుక్కోవాలి. కానీ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను చీకటిలోకి నెట్టేస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకున్నామని కసితో సంతృప్తి పడినంతసేపు పట్టదు…చేసిన నేరం బట్టబయలై, వారిని పట్టించడానికి…వారు జీవితాంతం జైలు ఊచలు లెక్కపెడుతూ గడపాల్సిందే. ఇదేనా వారు సాధించేది? ఇదేనా వారు పొందేది?
నేరం ఒక్కసారిగా జరగదు… అది చిన్న చిన్న భావోద్వేగాల సమూహం.
కోపం, అనుమానం, అసూయ… ఇవన్నీ కలిసినప్పుడు
పరిచయాన్న్నే ప్రమాదంగా మార్చేస్తాయి.
