ఉమ్మడి వరంగల్‌లో మూత పడిన దుకాణాలు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజామున నుండి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు, కుల ప్రజా సంఘాల నేతలు డిపోల ఎదుట బైఠాయించి ప్రగతి రథచక్రాలను బయటకు రాకుండా నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని మద్దతు ప్రకటించాయి.

బంద్ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, ములుగు ఆయా జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లల్లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్టులు సైతం బీసీ బందులో పాల్గొని మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ తమ మద్దతు ప్రకటించారు.






