తెరమీదకు సివిల్ తగాదా మామూలే
ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : భీమవరం డీఎస్పీ జయసూర్య ఈ రోజు రాజకీయ వలకు ఎలా చిక్కారు. అసలు భీమవరం అంటేనే పేకాట హబ్. ఇప్పటిది కాదు. ఉన్నవి మూడు క్లబులే .. కానీ రోజు టర్నోవరు .. మూడు కోట్లు పైనే.. అక్కడ కోసాట ఆడాలంటే.. కనీసం అరకోటి నగదుతో వెళ్తేనే క్లబ్ లో ఎంట్రీ.. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ పేకాట శిబిరాల్లో వేలు పెడితే.. పొలిటీషియన్ ఊరుకుంటాడా? కుట్టడా? అదీ సంగతి.
ఇక భీమవరంలో పేకాటను నెలరోజుల కిందటే ఎందుకు జయ సూర్య అడ్డుకున్నారు. ఇన్నాళ్లు బంగారు బాతు గుడ్డు పెట్టిన పేకాట క్లబ్బులను ఎందుకు మూయించారు. దీంతో ఎవరి పొట్టకు దెబ్బ తగిలింది? రాజకీయ నాయకులకు అందాల్సిన నెలవారీ మామూళ్లకు ఎసరు ఎవరు పెట్టారు. ఇది సరే మరి విజయవాడ, హైదరాబాద్ నుంచి కార్లల్లో వచ్చే గ్యాంబర్లకు దొడ్డి దారి ఎవరు చూపించారు. భీమవరంలో ఎన్ని అపార్ట్ మెంటుల్లో .. ఈ శిభిరాలు నడుస్తున్నాయి? ఇక్కడే జయసూర్య తప్పటడుగు వేశారని జూద ప్రియులు ఆరోపిస్తున్నారు.
ఇక భీమవరంలో పెద్ద క్లబ్ ను కట్టడి చేసి మరో క్లబ్ కు భరోసాగా నిలిచారని ప్రధాన ఆరోపణ. ఇక్కడి పేకాట రాయుళ్లందరూ చిన్న క్లబ్ దారి పట్టే సరికి క్లబ్ ల మధ్య పేచీ మొదలు కావటంతో.. మొత్తం క్లబ్బులకు తాళం వేశారు. ఈ స్థితిలో కొందరికి మోదం.. మరి కొందరికి ఖేదం మిగిలింది. ఇక సరిహద్దులోని నియోజక వర్గంలో అన్ని క్లబులకు డీఎస్పీ అవకాశం ఇచ్చారని, దీంతో భీమవరం పేకాటరాయుళ్లందరూ పది కిలోమీటర్ల దూరంలోని ట్రిపుల్ ఆర్ ఇలాఖాకు చేరటంతో.. భీమవరం క్లబ్ ధీరులకు కోపం పెరిగిందని జనం చెబుతున్నారు.
ఆయన నెలవారీ ఆదాయం ఆయన మిగుల్చుకుని.. మిగిలిన పేకాట క్లబుల స్థిరాదాయాన్ని దెబ్బకొట్టారని ఇప్పుడు కథలు కథలు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నేతలు ఆవేశంగా ఉన్నారు. వైసీపీ నేతలు రోజు వారీ లక్షలకు లక్షలు దండుకుంటే.. ఇప్పుడు పేకాటను నిలిపివేసే సరికి ఆగ్రహం ఆగలేదు. ఇక జయసూర్యపై ప్రధాన ఆరోపణలు సివిల్ సెటిల్ మెంట్స్.. వీటిలో రాజకీయ జోక్యం అనివార్యం. ఎమ్మెల్యే ముందు ఒక వర్గం గగ్గోలు పెడుతుంది.
మరి ఎమ్మెల్యేను సైతం డీఎస్పీ లెక్క చేయలేదనేది ప్రధాన ఆరోపణ. ఎనీ హౌ.. ఈ ఆరోపణలు ఎస్పీ మెడకూ చుట్టుకున్నాయి. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్ జీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా భీమవరం పేకాట చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ వ్యవహార శైలి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని, సివిల్ వ్యవహారాల్లో తల దూర్చడంతో తాము తలెత్తుకోలేక పోతున్నామని కూటమి నాయకులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు.
కానీ అసలు కారణం.. పేకాట హబ్ ను డీఎస్పీ దెబ్బతీశారని ప్రచారం జరుగుతోంది. పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్ కు ఫిర్యాదులు అందాయి. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తో ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం మాట్లాడారు. పవన్ కల్యాణ్ పలు ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని పవన్ కోరినట్లు సమాచారం.
అసాంఘిక వ్యవహారాలకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అండగా ఉంటూ, సివిల్ వ్యవహారాల్లో డీఎస్పీ స్థాయి అధికారి ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తల దూర్చకుండా చూడాలని ఎస్పీకి పవన్ కళ్యాణ్సూచించినట్లు సమాచారం. ఇటువంటి వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలని, ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
రంగంలోకి హోంమంత్రి, డీజీపీ
భీమవరం డీఎస్పీ జయ సూర్య వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సూచనతో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్త దృష్టికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై త్వరితగతన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు తెలుస్తుంది.
ఆయనే పోలీస్.. ఆయనే పొలిటీషియన్
భీమవరం డీఎస్పీ జయ సూర్య వ్యవహార శైలి కొంతమంది ముఖ్య నేతలకు అనుకూలంగా ఉండడంతో కూటమిలోని మరికొందరు నేతలు ఆగ్రహంగా ఉన్నారు. తమ పరిధిలోని నాయకుడి మాట చెల్లకపోవడంతో సివిల్ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం వంటివి ఈ పంచాయితీకి కారణంగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట చెల్లటం లేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
గతంలో భీమవరంలో సీఐగా పనిచేసిన జయసూర్యకు స్థానికంగా బలమైన పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోటే భీమవరం డీఎస్పీ గా ఇక్కడ పనిచేస్తున్నారంటున్నారు. గతంలో డీఎస్పీల బదిలీల్లో భాగంగా జయ సూర్యను బదిలీ చేసినా తిరిగి రెండు రోజుల్లోనే తిరిగి వచ్చి చేరారు. ఎంత చెప్పినా ఏకపక్ష వ్యవహార శైలితో తాము పడుతున్న ఇబ్బందులను ఇలా ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు.
పేకాట హబ్ లే .. కారణం
భీమవరం, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే పేకాట క్లబ్బుల వ్యవహారం కూడా డీఎస్పీ పై ఫిర్యాదులకు కారణ ప్రధాన కారణంగా తెలుస్తుంది. పేకాట క్లబ్బులు సజావుగా సాగినంత కాలం ఎటువంటి ఫిర్యాదులు లేవని, గత కొద్ది కాలంగా పేకాట క్లబ్బులు కొనసాగకపోవడంతో కొందరికి భారీ స్థాయిలో ఆదాయానికి గండి పడిందంటున్నారు. తమ ఆదాయానికి గండి పడటం, మరోపక్క అపార్ట్మెంట్లలో, శివారు ప్రాంతాలలో పేకాట, ఇతర జూద క్రీడల నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంపై మరొక కారణంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకుని ఎలా ముగింపు పలుకుతారో.. వాస్తవాలను ఎంత మేరకు తెరపైకి తీసుకొస్తారో వేచి చూడాల్సి ఉంది.