తొలి కార్డు కొనుగోలు చేసిన ట్రంప్
రెండో కార్డు ఎవరు కొంటారోనని వెయిటింగ్
ఒక్కో కార్డుకు 50 లక్షల డాలర్లు
పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చుకోనున్న అమెరికా
1000 గోల్డ్ కార్డులు అమ్ముడుపోయాయన్న ఆర్థికశాఖ
మోసాలను అరికట్టేందుకే ఈ చర్యలన్న ట్రంప్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫొటోతో ఉన్న ‘గోల్డ్ కార్డ్’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు ఈ ‘గోల్డ్ కార్డు’ అందించనున్నట్లు ట్రంప్ తెలిపారు. తాజాగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన గోల్డ్ కార్డ్‌ను చూపించారు. ట్రంప్ ఫొటోతో ఉన్న ఈ గోల్డ్ కార్డును 5 మిలియన్ డాలర్లతో ఎవరైనా సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. దీన్ని తానే మొదట కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. అయితే.. రెండోది ఎవరు కొంటారనేది తనకు తెలియదన్నారు. ఈ గోల్డ్ కార్డ్ రెండు వారాల్లో అమ్ముడయిపోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
నేరుగా అమెరికా పౌరసత్వం..
ఈబీ-5 (ఇన్వెస్టర్ వీసా) విధానాన్ని రద్దు చేసి ₹43.5 కోట్లు (50 లక్షల డాలర్లు) వెచ్చించేవారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీన్ని కొనుగోలు చేసినవారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీన్ని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ అంటున్నారు. ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని, ఒక్కరోజే 1000 గోల్డ్ కార్డులను విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. వీటి ద్వారా 5 బిలియన్ డాలర్లు సేకరించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు. ఈబీ-5 ప్రోగ్రామ్ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకే వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు గోల్డ్ కార్డ్ ఉపయోగపడుతుందన్నారు.
మోసాలను అరికట్టేందుకు..
అమెరికా 1990లో ఈబీ-5 వీసా విధానాన్ని తీసుకొచ్చింది. వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. దీంతో దీనికి 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును తెస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.