- ఇంద్రకీలాద్రి చుట్టూ విహరించిన గంగా పార్వతీ సమేత మల్లేశ్వరులు…
- భజన సంకీర్తనలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనలు నడుమ…
- స్వామివారిని అమ్మవారిని అనుసరించిన భక్తులు..
- ఆహ్లాదకర, భక్తి వాతావరణంలో ప్రదక్షణ…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఆదిదంపతుల గిరి ప్రదక్షణ అత్యంత వైభవంగా, భక్తి ప్రవర్తలు, ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగింది. విశ్వావాసు నామ సంవత్సర ఆషాఢ పౌర్ణమి (Ashada Purnima) సందర్భంగా గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ (Giri Pradakshina) అత్యంత వైభవంగా కొనసాగింది. సాక్షాత్తు కనకదుర్గమ్మ (Kanakadurgamma) వారి కొలువైయున్న ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి.
పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టంగా మన ఇతిహాసాలు చెబుతున్నాయి. గురువారం పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి (Indrakeeladri) గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు.

తప్పెట్లు, కోలాట నృత్యప్రదర్శనలు, భజన సంకీర్తనా గానం కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. నగర పురవీధుల్లో ఇంద్రకీలాద్రి చుట్టూ విహరించిన అమ్మవారిని స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని భక్తి పారవస్యానికి లోనయ్యారు.
