పనిచేసిన వారికి ప్రజల్లో ఆదరణ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా అందులో కౌన్సిలర్లుగా పాతవారితో పాటు కొత్తవారు కూడా పోటీ చేస్తున్నారు. ప్రధానంగా చౌటుప్పల్ పట్టణంలోని 16వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీచేసిన సీనియర్ జర్నలిస్టు వెన్ రెడ్డి రాజు విజయం సాధించడంతో పాటు తొలి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ ప్రధమ చైర్మన్ గా కూడా వెన్ రెడ్డి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. 16వ వార్డు కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా, రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ గా 16వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. తాను పోటీ చేసిన 16వ వార్డు ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వ్ చేయడం తో పాటు మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్ మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో చైర్మన్ గా పనిచేసిన రాజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు, ఆయన ఆశీర్వాదంతో తన భార్య వెన్ రెడ్డి సంధ్య ను తాను పని చేసిన 16వ వార్డు కౌన్సిలర్ గా రంగంలోకి దింపారు.
ఈ వార్డులో బలమైన ప్రత్యర్థులు ఎవరు లేకపోవడంతో సంధ్య కౌన్సిలర్ గా విజయం సాధించడం ఖాయమైంది. సంధ్య కౌన్సిలర్ గా విజయం సాధించడమే కాకుండా జనరల్ మహిళకు రిజర్వ్ చేసిన చైర్మన్ స్థానంలో కూడా తన భర్త రాజు స్థానంలో తాను చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 20 వార్డులలో పోటీ చేయగా అందులో 17వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం కాగా మిగతా 19 స్థానాల్లో పోటీ చేసి మెజార్టీ స్థానాలలో విజయం సాధిస్తామని రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు దీమా వ్యక్తం చేస్తున్నారు.
