Child marriages | బాల్య వివాహాల అంతం అందరి బాధ్యత కావాలి

Child marriages | బాల్య వివాహాల అంతం అందరి బాధ్యత కావాలి
- బాల్య వివాహారహిత తెలంగాణగా తీర్చిదిద్దాం
- బాధ్యతలు తీర్చుకోవడం కాదు
- బంగారు భవిష్యత్ నివ్వండి
- పేగుబంధాన్ని భారంగా బావించొద్దు
- వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
Child marriages | వరంగల్, ఆంధ్రప్రభ సిటీబ్యూరో : బాల్యవివాహాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కనకదుర్గ కాలనీలో మహిళా శిశు సంక్షేమ శాఖ, షేర్ ఎన్జీవో సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన ప్రచార రథాన్ని ఎంపీ డా.కడియం కావ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ బాల్యం అమూల్యమైన దశ అని పేర్కొన్నారు. బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక-మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎత్తి చూపారు.
చదువు మధ్యలో ఆగిపోవడం వల్ల జీవితాంతం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడు తాయన్నారు. .బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

బాల్యాన్ని విషాధంగా మార్చొద్దని సూచించారు. మానిసిక పరిపక్వత చెందక ముందే బాల్య వివాహాలు చేసి చేతులు దులుపుకొనే అలవాట్లను మానుకోవాలన్నారు. పేగుబంధం తెంచుకొన్న పిల్లలను భారంగా భావిస్తూ బాల్య వివాహాలు చేసే సంస్కృతిని ఇకనైనా వీడాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో షేర్ ఎన్జీవో డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కోఆర్డినేటర్ శిరీష, వరంగల్ సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ, సభ్యురాలు మధు, హనుమకొండ సీడబ్ల్యూసీ సభ్యుడు సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్లు జ్ఞానేశ్వరి, జగన్, చామంతి, జమున, ప్రశాంతి, కల్పన, ప్రభాకర్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

