తెలంగాణలో చికెన్ షాపులు బంద్..

తెలంగాణలో చికెన్ షాపులు బంద్..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. దీంతో వినియోగదారులు, వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. రిటైల్ చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేసారు. పౌల్ట్రీ వ్యాపారులు ఎదుర్కొంటున్న నష్టాలు, పెరుగుతున్న ఖర్చులు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు వెల్లడించాయి. దీంతో పట్టణాలు, గ్రామాల్లో చికెన్ షాపులు మూతపడ్డాయి. చికెన్ ధరలు స్థిరంగా లేకపోవడం వలన రవాణా ఖర్చులు అధికం కావడం వలన వ్యాపారం కొనసాగించడం కష్టమైందని వ్యాపారులు చెబుతున్నారు. రోజురోజుకూ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ సరైన లాభాలు లేకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బంద్ చేపట్టినట్లు తెలిపారు.
చికెన్ షాపులు బంద్ కావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాల పై కూడా ప్రభావం పడుతోంది. రోజువారీగా చికెన్ పై ఆధారపడే వ్యాపారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినియోగదారులు కూడా చికెన్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వ్యాపారం తగ్గిపోయిందని తెలుస్తోంది. వ్యాపార సంఘాలు ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
పౌల్ట్రీ రంగానికి సబ్సిడీలు, ఫీడ్ ధరల నియంత్రణ, విద్యుత్ చార్జీల తగ్గింపు వంటి చర్యలు తీసుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని వారు చెబుతున్నారు. తమ డిమాండ్ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే బంద్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉందని సూచించారు. ఇదిలా ఉంటే వినియోగదారులు చికెన్ ధరలు స్థిరపడాలని, షాపులు త్వరగా తెరుచుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం, వ్యాపారుల మధ్య చర్చలు జరిగి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.
